ప్రపంచ నంబర్‌వన్ ప్లేయర్, సెర్బియా స్టార్ నోవాక్ జొకోవిచ్‌కు దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉన్నది. ఏ సమయాన ఆస్ట్రేలియా గడ్డపై అడుగుపెట్టాడో కానీ అన్ని అవాంతరాలే ఎదురవుతున్నాయి. ప్రతిష్ఠాత్మక ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఎలాగైనా టైటిల్ నిలబెట్టుకోవాలన్న పట్టుదలతో వచ్చిన జొకో ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. నిబంధనలకు అనుగుణంగా వైద్య మినహాయింపులు లేకపోవడంతో వీసాను రెండోసారి రద్దు చేసిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.. దేశ బహిష్కరణ విధించింది. దీంతో మూడేండ్ల పాటు ఆస్ట్రేలియాలో పర్యటించే అవకాశాన్ని జొకో కోల్పోనున్నాడు. దేశ ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని ఇమిగ్రేషన్ మినిస్టర్ అలెక్స్ హాక్ తన విచక్షణాధికారాలను ఉపయోగించి ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం సంచలనం రేపింది. ఈ కారణంగా 17 నుంచి మొదలయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకో ప్రాతినిధ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆసీస్ ప్రభుత్వ నిర్ణయంపై కోర్టులో సవాలు చేసేందుకు జొకో సిద్ధమైన నేపథ్యంలో ఏం జరుగుతుందన్న దానిపై ఆసక్తి నెలకొన్నది.
మెల్బోర్న్: సెర్బియా టెన్నిస్ స్టార్ నోవాక్ జొకోవిచ్ వీసా సమస్య కొనసాగుతూనే ఉన్నది. వైద్యపరమైన మినహాయింపుల విషయంలో సరైన ఆధారాలు చూపని కారణంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం..జొకోపై కఠిన చర్యలకు పూనుకుంది. నిబంధనలు ఉల్లంఘించే విషయంలో ఎవరినీ లెక్కచేయమని కుండబద్దలు కొట్టింది. ముఖ్యంగా కరోనా వైరస్ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఆస్ట్రేలియాలో అడుగుపెట్టే వారిపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టం చేసింది. ఆ దేశ ఇమిగ్రేషన్ మినిస్టర్ అలెక్స్ హాక్ శుక్రవారం తన విచక్షణాధికారాలన్నింటినీ వాడుతూ జొకో వీసాను రద్దుచేయడంతో పాటు దేశ బహిష్కరణ విధించారు. దీంతో మూడేండ్ల పాటు ఆస్ట్రేలియా గడ్డపై జొకో తిరిగి అడుగుపెట్టే అవకాశం లేకుండాపోనుంది. ఆస్ట్రేలియా ప్రభుత్వ తాజా నిర్ణయంతో మరో మూడు రోజుల వ్యవధిలో మొదలయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జొకో బరిలోకి దిగే దానిపై మళ్లీ సందిగ్ధత ఏర్పడింది. డిఫెండింగ్ చాంపియన్‌గా ఎలాగైనా తిరిగి తన టైటిల్ నిలబెట్టుకోవడంతో పాటు రికార్డు స్థాయిలో 21వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌తో అరుదైన ఘనత సొంతం చేసుకుందామనుకున్న జొకో ఆశలు నీరుగారేలా కనిపిస్తున్నాయి. అయితే ఆస్ట్రేలియా ప్రభుత్వ తీర్పుపై ఫెడరల్ సర్క్యూట్, ఫ్యామిలీ కోర్టులో సవాల్ చేసేందుకు జొకో తరఫు న్యాయవాదులు సిద్ధమయ్యారు. ఆదివారం కేసు విచారణకు వస్తుందని జడ్జీ అంథోనీ కెల్లీ పేర్కొన్నారు. జొకో వీసాను రెండోసారి రద్దు చేయడం సరైంది కాదంటూ అతడి తరఫు న్యాయవాదుల బృందం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. వాక్సినేషన్‌ను కారణంగా చూపుతూ జొకో కెరీర్‌ను ప్రమాదంలోకి నెడుతున్నారంటూ వ్యాఖ్యానించింది. కేసు విచారణ పూర్తయ్యే వరకు జొకో నిర్బంధ కేంద్రంలో వసతి పొందనున్నాడు. ఒకవేళ జొకో ఆడకపోతే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సమీకరణాలు మారనున్నాయి.