మెల్బోర్న్: ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా ఓపెన్‌లో మాజీ చాంపియన్ నొవాక్ జొకోవిచ్, స్పెయిన్ సంచలనం కార్లొస్ అల్కరాజ్ జోరు కొనసాగిస్తున్నారు. శుక్రవారం జరిగిన వేర్వేరు మ్యాచ్‌లలో ఈ ఇద్దరూ తమ ప్రత్యర్థులను చిత్తుచేసి ఆస్ట్రేలియా ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్‌కు చేరారు. 25వ గ్రాండ్‌స్లామ్ టైటిల్ వేటలో ఉన్న జొకో 6-1, 6-4, 6-4తో థామస్ మెకాచ్ (చెక్ రిపబ్లిక్)ను వరుస సెట్లలో చిత్తు చేసి నాలుగో రౌండ్లోకి ప్రవేశించాడు. పూర్తి ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో ఈ సెర్బియా దిగ్గజం 9 ఏస్‌లు, 28 విన్నర్లు కొట్టాడు.
మరో పోరులో మూడో సీడ్ అల్కరాజ్ 6-2, 6-4, 6-7 (3/7), 6-2తో బోర్గ్స్ (పోర్చ్‌గీస్)పై గెలిచాడు. సుమారు 3 గంటల పాటు సాగిన మ్యాచ్‌లో మూడో సెట్ కోల్పోయిన ఈ స్పెయిన్ కుర్రాడు నాలుగో సెట్లో పుంజుకుని మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు. రెండో సీడ్ జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్ 6-3, 6-4, 6-4తో జాకబ్ ఫియర్న్లీ(బ్రిటన్)ను ఓడించగా హంబర్ట్ (ఫ్రాన్స్), లెహెక (చెక్) మూడో రౌండ్‌ను దాటారు.
ఈ టోర్నీ హ్యాట్రిక్ టైటిల్ వేటలో ఉన్న టాప్‌సీడ్ అరీనా సబలెంక.. మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో 7-6 (7/5), 6-4తో క్లారా టోసన్ (డెన్మార్క్)ను ఓడించి నాలుగో రౌండ్లో ప్రవేశించింది. కోకో గాఫ్ (అమెరికా) 6-4, 6-2తో లైలా ఫెర్నాండెజ్ (కెనడా)పై అలవోక విజయం సాధించింది. జపాన్ ప్లేయర్ నవోమి ఒసాకా 6-7 (3/7) ఒక సెట్ ముగియగానే గాయంతో బాధపడటంతో ఆమె మ్యాచ్ నుంచి తప్పుకోగా, బెలిందా (స్విట్జర్లాండ్) ముందంజ వేసింది. ఏడో సీడ్ జెస్సికా పెగులా (అమెరికా) 6-7 (3/7), 1-6తో అన్‌సీడెడ్ ఓల్గా (సెర్బియా) చేతిలో ఓటమిపాలైంది.
భారత వెటరన్ స్టార్ రోహన్ బోపన్న మిక్స్డ్ డబుల్స్‌లో రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. బోపన్న.. సుయ్ జంగ్ జోడీ 6-4, 6-4తో ఇవాన్ డొడిగ్-క్రిస్టినా జంటపై గెలిచింది.