French Open : మట్టి కోర్టులో సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్(Novak Djokovic) జోరు కొనసాగిస్తున్నాడు. పురుషుల సింగిల్స్‌లో 17వ సారి ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. వరుసగా 14వ సారి ఈ ఫీట్ సాధించాడు. దాంతో, ఒక గ్రాండ్‌స్లామ్ టోర్నీలో అత్యధికంగా క్వార్టర్ ఫైనల్ చేరిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అంతేకాదు మట్టి కోట మొనగాడు రఫెల్ నాదల్(Rafael Nadal) రికార్డు బద్ధలు కొట్టాడు. నాదల్ ఇప్పటివరకు 16 సార్లు మాత్రమే ఫ్రెంచ్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌కు చేరాడు.
ఫిలిప్పే చాట్రియర్ కోర్టులో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో జకోవిచ్ జుయన్ పబ్‌లో వరిల్లాస్(పెరూ)పై 6-3, 6-2, 6-2తో విజయం సాధించాడు. ఆరంభం నుంచి సెర్బియా స్టార్ ఆధిపత్యం చెలాయించాడు. గంట 57 నిమిషాలు సాగిన మ్యాచ్‌లో అతను ఆరు బ్రేక్ పాయింట్లు సాధించాడు. సూపర్ ఫామ్‌లో ఉన్న జకోవిచ్ ఈ టోర్నీలో ఇప్పటివరకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం విశేషం. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్(Australian Open) నెగ్గిన అతను 23వ గ్రాండ్‌స్లామ్‌పై కన్నేశాడు. అదే జరిగితే నాదల్(22 గ్రాండ్‌స్లామ్స్) రికార్డును జకోవిచ్ అధిగమిస్తాడు. తొడకండరాల గాయం నుంచి పూర్తిగా కోలుకోని నాదల్ టోర్నీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.
వరుస విజయాలతో జోరుమీదున్న జకోవిచ్ ఛాతిపై చిప్(Chip)తో వార్తల్లో నిలిచాడు. రెండో రౌండ్లోమార్టన్ ఫక్సోవిక్స్పై విజయం తర్వాత అతడు తన ఛాతి మధ్య భాగంలో చిన్నసైజ్ పరికరాన్ని టేపుతో అతికించుకోవడం కెమెరా కంట పడింది. ఇదే విషయమై అతడిని ప్రశ్నిస్తే.. తాను అత్యద్భుతమైన నానో టెక్నాలజీ(Nano Technology)ని ఉపయోగిస్తానని, అదొక పెద్ద రహస్యమని చెప్పాడు.
‘కోర్టులో నా ఆటను మెరుగుపరిచేందుకు నా బృందం నానో టెక్నాలజీని అద్భుతంగా ఉపయోగిస్తుంది. ఇక చిప్ గురించి అంటారా..? నా కెరీర్లో అదొక పెద్ద రహస్యం. అదే గనకు సమర్థంగా పనిచేయకుంటే నేను ఇప్పుడు ఇక్కడ కూర్చుండే వాడినే కాదు’ అని జకోవిచ్ వెల్లడించాడు.