Team India: టీమిండియాలో ఆటతో పాటు సంపాదన దగ్గరకు వచ్చేసరికి అత్యధికంగా ఆర్జించే ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ముందువరుసలో ఉంటారు. మ్యాచ్ ఫీజులు, ఐపీఎల్ కాంట్రాక్టులు, బ్రాండ్ ప్రమోషన్స్.. వంటి వాటితో ఈ ఇద్దరూ ప్రతి యేటా కోటానుకోట్ల రూపాయలు ఆర్జిస్తారు. కానీ ఈ ఏడాది మాత్రం మ్యాచ్ ఫీజుల ద్వారా అత్యధికంగా ఆదాయం పొందినవారిలో రోహిత్, కోహ్లీలు ఇద్దరూ లేరు. ఆ జాబితాలో టీమిండియా చైనామెన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పేరు దక్కించుకోవడం విశేషం.
అదేంటి..? కుల్దీప్ యాదవ్ మ్యాచ్‌లలో తప్ప పెద్దగా యాడ్స్‌లో కూడా కనిపించడు.. అలాంటిది కుల్దీప్కు కోహ్లీ, రోహిత్ కంటే అధిక ఆదాయం ఎలా వస్తుంది..? అనుకుంటున్నారా..! ఆగండాగండి, కుల్దీప్ సంపాదన కేవలం వన్డేలలో మాత్రమే. అది కూడా మ్యాచ్ ఫీజుల ద్వారా వచ్చే ఆదాయం. ఈ ఏడాది భారత్ నుంచి వన్డేలు ఆడినవారిలో అత్యధికంగా ఆదాయం పొందిన ఆటగాళ్ల జాబితాలో కుల్దీప్ నెంబర్ వన్ స్థానంలో ఉన్నాడు.
కుల్దీప్ ఫస్ట్.. గిల్ సెకండ్..
2023లో కుల్దీప్.. 50 ఓవర్ల ఫార్మాట్లో 30 మ్యాచ్‌లు ఆడి రూ. 1.80 కోట్లు ఆర్జించాడు. వన్డేలు ఆడినందుకు గాను భారత్ ఒక్కొక్క ఆటగాడికి రూ. 6 లక్షలు చెల్లిస్తుందన్న విషయం తెలసిందే. 2023లో అందరికంటే ఎక్కువ (30 వన్డేలు) మ్యాచ్‌లు ఆడిన ఈ మణికట్టు స్పిన్నర్.. 49 వికెట్లతో సత్తా చాటాడు. టీమిండియా యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. గిల్.. 29 మ్యాచ్‌లలో ఆడి రూ. 1.74 కోట్లు సంపాదించాడు. వన్డేలలో భారత్ తరఫున ఈ ఏడాది అత్యధిక పరుగులు చేసింది (1,584) కూడా ఈ పంజాబ్ ఆటగాడే..
శార్దూల్ లాస్ట్..
టీమిండియా సారథి రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ లు తలా 27 మ్యాచ్‌లు ఆడారు. ఈ త్రయానికి తలా రూ. 1.62 కోట్ల ఆదాయం దక్కింది. నాలుగో స్థానంలో ఉన్న రవీంద్ర జడేజా.. 26 మ్యాచ్‌లు ఆడగా ( రూ. 1.56 కోట్లు), మహ్మద్ సిరాజ్ 25 మ్యాచ్‌లు ఆడి రూ. 1.50 కోట్లతో ఐదో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత ఆరో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ (రూ. 1.26 కోట్లు), ఏడో స్థానంలో శ్రేయస్ అయ్యర్, హార్ధిక్ పాండ్యా (రూ. 1.20 కోట్లు), 8 వ స్థానంలో మహ్మద్ షమీ (రూ. 1.14 కోట్లు), 9వ ప్లేస్‌లో బుమ్రా, ఇషాన్ కిషన్ (రూ. 1.02 కోట్లు) ఉండగా శార్దూల్ ఠాకూర్ రూ. 96 లక్షల సంపాదనతో పదో స్థానంలో నిలిచాడు.
#ODIs#CricketTwitter #KuldeepYadav#ShubhmanGill pic.twitter.com/caxdwcKlex
— Arjun Singh Rana (@RanaAs146Rana) December 23, 2023
వన్డేలలో భారత్ జైత్రయాత్ర..
భారత క్రికెట్ జట్టుకు ఈ ఏడాది రెండు కీలక ఐసీసీ టోర్నీ ఫైనల్స్‌లో పరాభవాలు ఎదురైనా ద్వైపాక్షిక సిరీస్‌లలో మాత్రం అద్భుత విజయాలు అందుకుంది. ఈ ఏడాది ఐదు టెస్టులు ఆడిన భారత్.. పరిమిత ఓవర్ల క్రికెట్లో మాత్రం దుమ్మురేపింది. ముఖ్యంగా వన్డేలలో భారత్ అప్రతిహాత విజయాలను అందుకుంది. వన్డే వరల్డ్ కప్‌లో వరుసగా పది మ్యాచ్‌లు గెలుచుకుంది. మొత్తంగా 2023లో 35 మ్యాచ్‌లు ఆడి.. ఏకంగా 27 మ్యాచ్‌లలో విజయాలు సాధించింది. ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లలో ఆడి ఐదు గెలుచుకుంది. ఫిబ్రవరిలో స్వదేశంలో ఆసీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను మాత్రమే కోల్పోయింది. శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలను స్వదేశంలో ఓడించిన భారత్, వెస్టిండీస్, సౌతాఫ్రికాను వారి సొంతగడ్డపై మట్టికరిపించింది. ఆసియా కప్‌లో కూడా భారత్‌దే విజయం.