WWC | భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో తొలిసారిగా మహిళల వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. నవీ ముంబయిలో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించింది. ఈ చారిత్రాత్మక మ్యాచ్‌కు సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, మిథాలీ రాజ్, జులన్ గోస్వామి వంటి దిగ్గజాలు హాజరై భారత జట్టును ఉత్సాహపరిచారు. కానీ, మ్యాచ్ తర్వాత దక్షిణాఫ్రికా నటి, రచయిత్రి తంజ వుర్ ఆ దేశ క్రీడాకారులు, అధికారులపై అంతృప్తి వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ‘వారి దేశం (భారత్) శ్రద్ధ వహించింది భారత్ గెలిచింది’ అని తంజ వుర్ చెప్పుకొచ్చింది. ‘భారత్ ప్రపంచకప్‌ను గెలుచుకున్నారు.
నేను మిమ్మల్ని అభినందించాలనుకుంటున్నాను. కానీ ముందుగా నేను మీకు ఒకటి చెబుతాను. సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, వీవీఎస్ లక్ష్మణ్ వంటి వారు మీకు మద్దతు ఇచ్చేందుకు వచ్చారు. కానీ, దక్షిణాఫ్రికా నుంచి ఎవరు వచ్చారు? ఎవరూ లేరు! మనం ఎంతగానో ప్రేమించే మన మాజీ క్రికెటర్లు ఎక్కడ ఉన్నారు? బహుశా ఈ టోర్నమెంట్ వారికి తగినంత హై ప్రొఫైల్ కాకపోవచ్చు. ఎవరూ రాలేదు. మన క్రీడా మంత్రి కూడా అక్కడ లేరని నేను అనుకుంటున్నాను’ అని వ్యాఖ్యానించింది. ‘భారతదేశం గెలిచింది. ఎందుకంటే వారి దేశం తన జట్టు గురించి శ్రద్ధ వహిస్తుంది’ అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియోలో ‘మన అమ్మాయిలు కష్టపడ్డారు.
కానీ, ఎవరూ పట్టించుకోలేదు, కానీ ఎవరూ వారికి మద్దతు ఇవ్వనప్పుడు ఎలా అనిపిస్తుంది? మనం ఓడిపోతామని వారు ఇప్పటికే ఊహించారా? వారు చెప్పడానికి ప్రయత్నిస్తున్న సందేశం అదేనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత క్రికెట్‌ను ప్రశంసిస్తూ.. మీరు ఈ ప్రపంచకప్ నిజమైన విజేతలు. ఈ విజయానికి అర్హులు’ అంటూ వ్యాఖ్యానించారు. మ్యాచ్ తర్వాత దక్షిణాఫ్రికా ప్రధాన కోచ్ మాండ్లా సైతం భారత్ సత్తా చాటిందని అంగీకరించారు. మా కంటే భారత్ గెలవాలని ఈ ప్రపంచకప్ కోరుకుందని.. రాబోయే ఎడిషన్‌లో తాము మళ్లీ ప్రయత్నిస్తామన్నారు. భారత జట్టు తొలి పది ఓవర్లలో శుభారంభం చేసిందని.. తమ జట్టు భారీ స్కోర్ చేయకుండా అడ్డుకుందని.. ఒక దశలో భారత్ 350 నుంచి 360 పరుగులు చేస్తారని భావించామని.. కానీ, 300 పరుగుల స్కోర్ దాటనివ్వకపోవడం తమ బౌలర్ల విజయమని మాండ్లా పేర్కొన్నారు.