IND BAN 2nd T20 : తొలి టీ20లో స్వల్ప లక్ష్యాన్ని 11.5 ఓవర్లకే ఊదిపడేసిన భారత జట్టు రెండో మ్యాచ్‌లో కొండంత స్కోర్ కొట్టింది. ఢిల్లీ మైదానంలో బంగ్లాదేశ్ బౌలర్లను నితీశ్ కుమార్ రెడ్డి(74), రింకూ సింగ్(53)లు ఊచకోత కోశారు. ఈ జోడీ సుడిగాలిలా చెలరేగగా టీమిండియా 221 రన్స్ చేసింది. శుభారంభం దక్కకపోయినా నితీశ్, రింకూలు పిడుగుల్లా బంగ్లాపై పడ్డారు. దొరికిన బంతిని దొరికినట్టు బౌండరీకి పంపి స్కోర్ బోర్డును రాకెట్లా ఉరికించారు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా(32) ‘నేనేమన్నా తక్కువా’ అంటూ విధ్వంసాన్ని తారాస్థాయికి తీసుకెళ్లాడు. ఇంకేముంది రికార్డులు మరోసారి బద్ధలయ్యాయి. పొట్టి క్రికెట్లో బంగ్లాదేశ్‌పై టీమిండియా అత్యధిక స్కోర్ కొట్టేసింది.
ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం సిక్సర్ల మోతతో దద్దరిల్లింది. అలాగని 360 ప్లేయర్ సూర్యకుమార్ యాదవ్(8) లేదా ఓపెనర్లు సంజూ శాంసన్(10), అభిషేక్ శర్మ(15)లు దంచలేదు. ఈ ముగ్గురూ తేలిపోయిన చోట తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి(74 : 34 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్సర్లు) విధ్వంసక ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయాడు. అతడికి అగ్నికి వాయవు తోడైనట్టు రింకూ సింగ్ (53 : 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) కలిశాడు.
Innings Break!
Half-centuries from Nitish Kumar Reddy(74) and Rinku Singh(53) and quick-fire knocks by Hardik Pandya and Riyan Parag, propel #TeamIndia to a total of 221/9.
Scorecard – https://t.co/Otw9CpO67y… #INDvBAN@IDFCFIRSTBank pic.twitter.com/JTDcEsaHqg
— BCCI (@BCCI) October 9, 2024
ఈ ఇద్దరి ఉతుకుడుకు బంగ్లాదేశ్ బౌలర్లు బిక్కమొహాలు వేశారు. బౌండరీలే లక్ష్యంగా ఆడిని నితీశ్, రింకూలు టీ20ల్లో తొలి అర్ధ సెంచరీతో వారెవ్వా అనిపించారు. వీళ్ల దూకుడుకు నీరుగారిపోయిన బంగ్లా బౌలర్లు ఎక్కడ బంతులు వేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ జోడీ నాలుగో వికెట్‌కు 107 పరుగుల కలిపింది. ఈ జోడీని ముస్తాఫిజుర్ విడదీసినా.. హార్దిక్ పాండ్యా(32), రియాన్ పరాగ్(15)లు దుమ్మురేపారు. దాంతో, 19వ ఓవర్లో టీమిండియా స్కోర్ 200 దాటింది.