హైదరాబాద్, ఆట ప్రతినిధి: కొచ్చి(కేరళ) వేదికగా జరుగుతున్న జాతీయ ఫెడరేషన్ సీనియర్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ అథ్లెట్ నిత్య గాదె డబుల్ ధమాకాతో అదరగొట్టింది. టోర్నీలో ఇప్పటికే 100మీటర్ల రేసులో పసిడి కొల్లగొట్టిన నిత్య తాజాగా 200మీటర్ల స్ప్రింట్లోనూ సత్తాచాటింది.
గురువారం జరిగిన రేసును నిత్య 23.68సెకన్లలో ముగించి రెండో స్వర్ణాన్ని ఖాతాలో వేసుకుంది. ఇదే పోటీలో పాల్గొన్న ఏంజెల్ సిల్వా (23.91సె), సుదీక్ష (24.31సె) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ఆది నుంచే తనదైన జోరు కనబరిచిన నిత్య..ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ పసిడి కొల్లగొట్టింది.