SL vs BAN : ఆసియా కప్‌లో మాజీ ఛాంపియన్ శ్రీలంక (Srilanka) బోణీ కొట్టింది. గ్రూప్ బీ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత ప్రత్యర్థిని తక్కువకే కట్టడి చేసిన లంక.. 140 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూపాడుతూ ఛేదించింది. ఓపెనర్ పథుమ్ నిశాంక(50) హాఫ్ సెంచరీతో చెలరేగి విజయానికి పునాది వేయగా.. మిడిలార్డర్లో కమిల్ మిషరా(46 నాటౌట్) రాణించడంతో లంక అలవోకగా బంగ్లాను చిత్తు చేసింది. దాంతో.. రెండో విక్టరీతో సూపర్ 4 సాధించాలనుకున్న లిటన్ దాస్ బృందానికి నిరాశే మిగిలింది.
ఆసియా కప్ పదిహేడో సీజన్‌ను శ్రీలంక ఘనంగా ఆరంభించింది. అబూదాబీలోని షేక్ జయేద్ స్టేడియంలో బంగ్లాదేశ్‌ను ఓడించి పాయింట్ల ఖాతా తెరిచింది లంక. బంగ్లా నిర్దేశించిన 140 పరుగుల ఛేదనను ఓపెనర్ పథుమ్ నిశాంక (50) ధాటిగా మొదలెట్టాడు. రెండో ఓవర్లోనే ఓపెనర్ కుశాల్ మెండిస్ (3) ఔటైనా కమిల్ మిషరా(46 నాటౌట్)తో కలిసి 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. వీళ్లిద్దరి విజృంభణతో పది ఓవర్లకే బంగ్లా ఓటమి ఖాయమైపోయింది. అర్ధ శతకం తర్వాత మెహిదీ హసన్ ఓవర్లో నిశాంక వెనుదిరిగాడు. కాసేపటికే కుశాల్ పెరీరా(9), దసున్ శనక(1) పెవిలియన్ చేరినా.. మిషరా అజేయంగా నిలిచి జట్టుకు 6 వికెట్ల విజయాన్ని అందించాడు. దాంతో.. 14.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది లంక.
Sri Lanka start with a BIG W 🔥#SLvBAN scorecard ⏩ https://t.co/3X9o1nkWFw pic.twitter.com/h373UmUvyH
— ESPNcricinfo (@ESPNcricinfo) September 13, 2025
హాంకాంగ్‌పై దంచికొట్టిన బంగ్లాదేశ్ ఆటగాళ్లు శ్రీలంకపై జోరు చూపించలేకపోయారు. చమీర విజృంభణతో ఓపెనర్లు డకౌట్ అవ్వడంతో ఆదిలోనే బంగ్లా కష్టాల్లో పడింది. సున్నాకే రెండు వికెట్లు కోల్పోయిన జట్టును కెప్టెన్ లిటన్ దాస్(28), తౌహిద్ హ్రిదోయ్(9)లు ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ, హసరంగ ఓవర్లో లిటన్ దొరికిపోగా.. కమిల్ మిషరా మెరుపు త్రోకు తౌహిద్ రనౌట్‌గా వెనుదిరిగాడు. 38 పరుగులకే నాలుగు వికెట్లు పడిన దశలో షమీమ్ హొసేన్(42 నాటౌట్), జకీర్ అలీ(41 నాటౌట్)లు క్రీజులో పాతుకపోయి ఏడో వికెట్‌కు 81 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. చివరి రెండు ఓవర్లలో 26 రన్స్ పిండుకుంది ఈ జోడీ. హొసేన్, జకీర్‌లు ఆరో వికెట్‌కు అజేయంగా 81 పరుగులు రాబట్టడంతో.. బంగ్లా నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 139 పరుగులు చేయగలిగింది.