లివర్‌పూల్ : రెండుసార్లు ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్.. మూడో మెడల్‌కు అడుగు దూరంలో నిలిచింది. లివర్‌పూల్ (ఇంగ్లండ్)లో జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా సోమవారం ముగిసిన మహిళల 51 కిలోల ప్రిక్వార్టర్స్‌లో నిఖత్.. 5-0తో జపాన్ బాక్సర్ యుని నిషినకను ఓడించి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. ప్రిక్వార్టర్స్‌లో నిషినక.. నిఖత్‌కు దీటైన పోటీనిచ్చింది. ఇద్దరు బాక్సర్లు దూకుడుగా ఆరంభించి ఒకరిపై ఒకరు పంచ్‌లతో విరుచుకుపడినా తొలి రౌండ్లో నిఖత్ 3-2తో నిలిచింది. అదే జోరులో ఈ తెలంగాణ అమ్మాయి రెండో రౌండ్లో 4-1తో రెచ్చిపోయింది.
ఇక చివరి రౌండ్లో నిషినక ఎదురుదాడికి దిగినా నిఖత్ వాటిని సమర్థంగా ఎదుర్కోవడమే గాక గేమ్‌ను 5-0తో గెలుచుకుంది. ఇప్పటికే రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన నిఖత్.. సెమీస్‌కు చేరితే పతకం ఖాయం చేసుకున్నట్టే. కాగా క్వార్టర్స్‌లో ఆమె రెండుసార్లు ఒలింపిక్ రజత పతక విజేత అయిన టర్కీ బాక్సర్ బుసె కకిరొగ్లుతో అమీతుమీ తేల్చుకోనుంది. నిఖత్ క్వార్టర్స్ చేరగా సుమిత్ (75 కిలోలు), సచిన్ సివాచ్ (60 కి.), నరేందర్ బెర్వాల్ (90+ కి.) ప్రిక్వార్టర్స్‌లో ఓటమి పాలయ్యారు.