న్యూఢిల్లీ: మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో నీతు (48 కేజీలు) శుభారంభం చేసింది. ఇస్తాంబుల్ వేదికగా జరుగుతున్న మెగాటోర్నీలో నీతు.. రొమేనియాకు చెందిన వెటరన్ బాక్సర్ స్టెలుటాపై విజయం సాధించి ప్రిక్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన స్ట్రాంజా స్మారక టోర్నీలో స్వర్ణం నెగ్గిన 21 ఏండ్ల నీతు అదే జోరు కొనసాగిస్తూ.. 40 ఏండ్ల ప్రత్యర్థిపై పంచ్‌ల వర్షం కురిపించింది. శనివారం జరుగనున్న తదుపరి పోరులో మార్టా లోపేజ్ (స్పెయిన్)తో నీతు తలపడనుంది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన స్టార్ బాక్సర్ లవ్లీనా బొర్గోహై తొలి రౌండ్లో విజయం సాధించి ముందంజ వేసిన విషయం తెలిసిందే.
నేడు నిఖత్ పోరు..
తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ బుధవారం బరిలోకి దిగనుంది. 52 కేజీల విభాగంలో బరిలోకి దిగుతున్న నిఖత్ తొలి రౌండ్లో మెక్సికోకు చెందిన హెరీరా అల్వరేజ్తో అమీతుమీ తేల్చుకోనుంది. ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం పతకం నెగ్గిన నిఖత్ ఈ టోర్నీ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంది. 73 దేశాల నుంచి 310 మంది బాక్సర్లు పోటీ పడుతున్న ఈ టోర్నీలో బుధవారం మనీషా (57 కేజీలు), పర్వీన్ (63 కేజీలు), సవీటి (75 కేజీలు) కూడా బరిలోకి దిగనున్నారు.