Women’s World Cup | కుచింగ్ (మలేషియా): ఐసీసీ అండర్-19 మహిళల ప్రపంచకప్‌లో సోమవారం పెను సంచలనం నమోదైంది. పసికూన నైజీరియా.. పటిష్ట న్యూజిలాండ్‌ను ఓడించి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో నైజీరియా 2 పరుగుల తేడాతో గెలిచింది. తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న ఆ జట్టుకు అంతర్జాతీయ స్థాయిలో ఇదే మొదటి విజయం కావడం విశేషం. వర్షం అంతరాయం వల్ల 13 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన నైజీరియా 6 వికెట్ల నష్టానికి 65 పరుగులు చేసింది. ఆ జట్టులో కెప్టెన్ లక్కీ పీటి (19), లిలియన్ ఉడె (18) రెండంకెల స్కోరు చేశారు.
అనంతరం స్వల్ప ఛేదనలో కివీస్ అమ్మాయిలు.. 13 ఓవర్లలో 63/6 మాత్రమే చేయగలిగారు. ఛేదనలో భాగంగా 11 ఓవర్లలో 49/5గా ఉన్న న్యూజిలాండ్.. చివరి రెండు ఓవర్లలో విజయానికి 17 పరుగులు అవసరం కాగా 12వ ఓవర్లో 8 పరుగులు రాబట్టింది. ఆఖరి ఓవర్లో 9 పరుగులు అవసరముండగా ఆ జట్టు 6 పరుగులు మాత్రమే చేయడంతో నైజీరియా చరిత్రాత్మక విజయం సాధించింది. గ్రూప్-సీలో సౌతాఫ్రికా తర్వాత నైజీరియా రెండో స్థానంలో ఉండటంతో ఆ జట్టు సూపర్ సిక్స్‌కు అర్హత సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మిగిలిన మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా.. బంగ్లాదేశ్‌ను ఓడించగా ఐర్లాండ్‌పై యూఎస్ఏ, పాకిస్థాన్‌పై ఇంగ్లండ్, నేపాల్‌పై స్కాట్లాండ్, సమోవాపై సౌతాఫ్రికా విజయాలు సాధించాయి.
ప్రపంచకప్‌లో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ భారత్.. మంగళవారం మలేషియాతో మ్యాచ్ ఆడనుంది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన టీమ్ఇండియా.. మలేషియానూ భారీ తేడాతో ఓడించి సూపర్-6 బెర్తును ఖాయం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. ఇక శ్రీలంకతో ఆడిన తొలి మ్యాచ్‌లో 23 పరుగులకే ఆలౌట్ అయిన ఆతిథ్య మలేషియా.. జోరు మీదున్న భారత్‌కు ఏ మేరకు పోటీనిస్తుందో చూడాలి.