Womens T20 World Cup 2024 : తొలి సీజన్ నుంచి ఊరిస్తున్న మహిళల టీ20 వరల్డ్ కప్‌ను న్యూజిలాండ్ (Newzealand) కొల్లగొట్టింది. ఎట్టకేలకు మూడో ప్రయత్నంలో కివీస్ పొట్టి కప్‌ను ఒడిసి పట్టి చాంపియన్‌గా అవతరించింది. ఆదివారం దుబాయ్‌లో జరిగిన ఫైనల్లో నిరుడు రన్నరప్ దక్షిణాఫ్రికా (South Africa)ను చిత్తుగా ఓడించి టైటిల్ ఎగరేసుకుపోయింది. ఐసీసీ ట్రోఫీల్లో సఫారీలకు అందని ద్రాక్షలా మిగిలిన ట్రోఫీని కివీస్ గద్దలా తన్నుకుపోయింది. 159 పరుగుల భారీ చేధనలో అమేలియా కేర్(24/3) విజృంభణతో సఫారీ జట్టు ఒత్తిడిలో పడిపోయింది. కెప్టెన్ లారా వొల్వార్డ్త్(33) మినహా ఏ ఒక్కరూ స్థాయికి తగ్గట్టు ఆడలేదు. టెయిలెండర్లు పోరాడినా జట్టు తొలి టైటిల్ కలను నిజం చేయలేకపోయారు.
ఐసీసీ ట్రోఫీ ఫైనల్లో దక్షిణాఫ్రికాకు మరోసారి గుండెకోత. జూన్ 30వ తేదీన భారత పురుషుల జట్టు చేతిలో ఎడెన్ మర్క్రమ్ సేన ఓటమిపాలై తొలి కప్‌ను చేజార్చుకుంది. ఇప్పుడు దక్షిణాఫ్రికా మహిళల జట్టు సైతం ఆఖరి మెట్టుపై తడబడి మరోసారి రన్నరప్‌గా వెనుదిరిగింది.
👑 CHAMPIONS 👑
New Zealand win their maiden Women’s #T20WorldCup title 🏆#WhateverItTakes #SAvNZ pic.twitter.com/DOfyWZgLUf
— ICC (@ICC) October 20, 2024
మొదట బౌలింగ్‌ల్ విఫలమైన సఫారీ జట్టు అనంతరం బ్యాటింగ్‌లోనూ తడబడింది. న్యూజిలాండ్ నిర్దేశించిన 159 పరుగుల ఛేదనలో కెప్టెన్ లారా వొల్వార్డ్త్(33), తంజిమ్ బ్రిస్ట్(17)లు ధాటిగా ఆడారు. రన్‌రేటు 7కు తగ్గకుండా ధనాధన్ ఆడారు. దాంతో, సఫారీ జట్టు 6 ఓవర్లకు వికెట్ కోల్పోకుండా 47 పరుగులు పిండుకుంది.
NEW ZEALAND WIN THEIR FIRST WOMEN’S T20 WORLD CUP! 🏆
After losing in two finals in 2009 and 2010, they have finally done it in 2024! pic.twitter.com/2rhJejxDTF
— ESPNcricinfo (@ESPNcricinfo) October 20, 2024
పవర్ ప్లే తర్వాతి ఓవర్లో తంజిమ్ భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ వద్ద గ్రీన్‌కు చిక్కింది. అలా 51 వద్ద సఫారీల తొలి వికెట్ పడింది. అమేలియా కేర్ 10వ ఓవర్లో మొదట లారాను .. ఆఖరి బంతికి డేంజరస్ అనెకె బొస్చ్(9)ను పెవిలియన్ పంపి సఫారీలను ఒత్తిడిలో పడేసింది. ఆ సమయంలో బాధ్యతగా ఆడాల్సిన మరినే కాప్(8), నడినె డిక్లెర్క్(6)లు దంచబోయి వికెట్ పారేసుకున్నారు. అంతే.. 77 పరుగులకే సగం మంది డగౌట్ చేరారు. ఇక.. జట్టును గెలిపించాల్సిన బరువు టెయిలెండ్ల మీద పడింది. కానీ, వరుసగా వికెట్లు తీసిన కివీస్ బౌలర్లు దక్షిణాఫ్రికాను ఓటమి అంచుల్లోకి నెట్టారు.
న్యూజిలాండ్ భారీ స్కోర్ చేసింది. తొలి కప్ కలను నిజం చేసుకొనే దిశగా ప్రత్యర్థి దక్షిణాఫ్రికాకు పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్ సుజీ బేట్స్(32) గట్టి పునాది వేయగా కివీస్ పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 43 పరుగులు చేసింది. అనంతరం సూజీ, కెప్టెన్ సోఫీ డెవిన్(6)లు తొందరగానే ఔట్ అయినా.. ఆల్‌రౌండర్ అమేలియా కేర్(43), బ్రూకే హల్లిడే(38)లు దంచి కొట్టారు. సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ చకచకా డబుల్స్, బౌండరీలు సాధించింది.
New Zealand put up the second-highest first innings total in a women’s T20 World Cup final 🔥
No team has chased a 150+ score before 👀 pic.twitter.com/sg4GvcJXYJ
— ESPNcricinfo (@ESPNcricinfo) October 20, 2024
వీళ్ల జోరుతో 15వ ఓవర్లో న్యూజిలాండ్ స్కోర్ 100 దాటింది. నాలుగో వికెట్‌కు 57 పరుగులు కలిపిన ఈ జోడీని ట్రయాన్ విడదీసింది. డేంజరస్ హల్లిడే వికెట్ పడడంతో సఫారీ జట్టు ఊపిరి పీల్చుకుంది. కానీ, లాబా వేసిన 19వ ఓవర్ తొలి రెండు బంతుల్ని బౌండరీకి పంపిన అమేలియా జట్టు స్కోర్ 140 దాటించింది. ఆఖరి ఓవర్లో మ్యాడీ గ్రీన్(12 నాటౌట్) సిక్సర్ బాదేసింది. దాంతో, కివీస్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది.