AP High Court -MBBS Councelling | ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఆ రాష్ట్ర హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఓపెన్ క్యాటగిరీ సీటు ఒకటి ఖాళీగా ఉంచాలని ఆదేశించింది. షేక్ సానియా ఆజ్రా అనే విద్యార్థినికి నీట్-2024లో 626 మార్కులు రాగా, ఆమె బీసీ-ఈ క్యాటగిరీ కింద అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకున్నారు. ఆమెకు అనంతపురం ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఓపెన్ క్యాటగిరీ కింద సీటు వచ్చింది.
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం జారీ చేసిన సీట్ల మ్యాట్రిక్స్ ప్రకారం కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఎనిమిది బీసీ-ఈ క్యాటగిరీ సీట్లు ఉండగా, ఏడు మాత్రం భర్తీ చేసి, మరో సీటు జనరల్ ఓపెన్ మెరిట్ క్యాటగిరీకి మళ్లించారు. ఈ విషయమై షేక్ సానియా ఆజ్రా శనివారం హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది ఠాగూర్ యాదవ్ వాదిస్తూ.. ఒకసారి సీట్ల కేటాయింపు ప్రారంభమైన తర్వాత సీట్ మ్యాట్రిక్స్ మార్చడానికి వీల్లేదన్నారు. తన పిటిషనర్‌కు తొలి రౌండ్లో ఓపెన్ క్యాటగిరీలో సీటు వచ్చిందన్నారు. మూడో రౌండ్ కౌన్సెలింగ్ లో కర్నూల్ మెడికల్ కళాశాలలో ఓపెన్ క్యాటగిరీలో సీటు పొందడానికి అవకాశం కల్పించాలని అభ్యర్థించారు.
పిటిషనర్ తరఫు వాదనలను విన్న చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవిలతో కూడిన ద్విసభ్య బెంచ్.. ఎంబీబీఎస్ మూడో విడుత కౌన్సెలింగ్‌లో కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఒక ఓపెన్ క్యాటగిరీ సీటు భర్తీ చేయకుండా ఖాళీగా ఉంచాలని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది.