NZ vs SA : ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) లో భాగంగా బుధవారం జరుగుతున్న సెకండ్ సెమీఫైనల్ (Second Semi Final) మ్యాచ్‌లో న్యూజిలాండ్ దూకుడుగా ఆడుతోంది. ఇద్దరు బ్యాటర్లు సెంచరీలతో కదం తొక్కారు. ఓపెనర్ రచిన్ రవీంద్ర (Rachin Ravindra) 101 బంతుల్లో 108 పరుగులు రాబట్టగా.. సీనియర్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) 94 బంతుల్లోనే 102 పరుగులు చేశాడు. దాంతో 43 ఓవర్ల ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 4 వికెట్ల నష్టానికి 274 పరుగులతో పటిష్ట స్థితిలో ఉంది. సౌతాఫ్రికా బౌలర్లలో కాగిసో రబాడా 2 వికెట్లు, లుంగీ ఎంగిడి, వియాన్ ముల్దర్ చెరో వికెట్ పడగొట్టారు.
ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి న్యూజిలాండ్ బ్యాటర్లు దూకుడుగా ఆడారు. జట్టు స్కోర్ 48 పరుగుల వద్ద ఓపెనర్ విల్ యంగ్ (21) ఔటయ్యాడు. ఎంగిడి బౌలింగ్‌లో మార్కరమ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ రచిన్ రవీంద్రతో కేన్ మామ జతచేరాడు. ఇద్దరూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. సెంచరీలతో కదం తొక్కారు. దాంతో 40 ఓవర్లకే జట్టు స్కోర్ 250 పరుగులు దాటింది.
రచిన్ రవీంద్ర 34వ ఓవర్లో రబాడా బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత 40 ఓవర్లో విలియమ్సన్ కూడా ఔటయ్యాడు. ముల్దర్ బౌలింగ్‌లో లుంగి ఎంగిడికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం డారెల్ మిచెల్ (21), గ్లెన్ ఫిలిప్స్ (3) పరుగులతో క్రీజులో ఉన్నారు. టామ్ లాథమ్ (4) తక్కువ స్కోర్‌కే ఔటై నిరాశపర్చాడు.