క్రీడాభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్దే ప్రపంచకప్ నకు రంగం సిద్ధమైంది. సినిమా రిలీజ్ కు ముందు ట్రైలర్ లా.. వరల్డ్ కప్ నకు ముందు వార్మప్ మ్యాచ్ లు మొదలయ్యాయి. మెగాటోర్నీకి జట్లను ప్రకటించాల్సిన గడువు ముగియడంతో.. ప్రధాన టీమ్ లన్నీ తమ అస్త్రశస్ర్తాలను సరి చూసుకుంటున్నాయి.
పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య ఉప్పల్ వేదికగా జరిగిన వార్మప్ మ్యాచ్ ను ఇరు జట్లు పూర్తిగా వినియోగించుకున్నాయి. బ్యాటింగ్కు స్వర్గధామంలా కనిపించిన పిచ్ పై మొదట పాకిస్థాన్ దంచికొడితే.. చేజింగ్లో కివీస్ బ్యాటర్లు వీరంగమాడారు. గాయం నుంచి కోలుకున్న కేన్ మామ అర్ధశతకంతో ఆకట్టుకుంటే.. ఓపెనర్ గా వచ్చిన రచిన్ రవీంద్ర, డారిల్ మిషెల్, మార్క్ చాప్ మన్ దుమ్మురేపారు. ఫలితంగా భారీ స్కోర్ల మ్యాచ్ లో న్యూజిలాండ్ జయభేరి మోగించింది.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక వన్డే ప్రపంచకప్ ప్రారంభానికి ముందు.. న్యూజిలాండ్ విశ్వరూపం కనబర్చింది. ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో శుక్రవారం జరిగిన పోరులో న్యూజిలాండ్ వికెట్ల తేడాతో పాకిస్థాన్ ను చిత్తుచేసింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 345 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ మహమ్మద్ రిజ్వాన్ (94 బంతుల్లో 103 రిటైర్డ్ హర్ట్; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కగా.. కెప్టెన్ బాబర్ ఆజమ్ (80; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), సౌద్ షకీల్ (53 బంతుల్లో 75; 5 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ధశతకాలతో సత్తాచాటారు.
న్యూజిలాండ్ బౌలర్లలో మిషెల్ శాంట్నర్ 2, మ్యాట్ హెన్రీ, ఫెర్గూసన్, నీషమ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష ఛేదనలో న్యూజిలాండ్ 43.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 346 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (72 బంతుల్లో 97; 16 ఫోర్లు, ఒక సిక్సర్) ఎడాపెడా బౌండ్రీలతో విరుచుకుపడగా.. కేన్ విలియమ్సన్ (54; 8 ఫోర్లు), డారిల్ మిషెల్ (59; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మార్క్ చాప్ మన్ (41 బంతుల్లో 65 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నారు. పాకిస్థాన్ బౌలర్లలో ఉసామా మిర్ 2, హసన్ అలీ, సల్మాన్, వసీమ్ తలా ఒక వికెట్ ఖాతాలో వేసుకున్నారు. ఈ మ్యాచ్ కు భద్రత కల్పించలేం అని పోలీసులు ముందే తెలపడంతో.. స్టేడియంలోనికి అభిమానులను అనుమతించలేదు. వార్మప్ మ్యాచ్ ల్లో భాగంగా శనివారం గువాహటి వేదికగా.. ఇంగ్ల్ండ తో భారత్ తలపడనుంది. ఇక మంగళవారం ఉప్పల్ లో జరుగనున్న వార్మప్ మ్యాచ్లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.
పాకిస్థాన్: 345/5 (రిజ్వాన్ 103 రిటైర్డ్ హర్ట్, బాబర్ 80; శాంట్నర్ 2/39, హెన్రీ 1/8), న్యూజిలాండ్ 43.4 ఓవర్లలో 346/5 (రచిన్ రవీంద్ర 97, చాప్ మన్ 65 నాటౌట్; ఉసామా మిర్ 2/68).