డునెడిన్: బ్యాటర్ల జోరుకు, బౌలర్ల సహకారం తోడవడంతో.. బంగ్లాదేశ్తో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ ఘనవిజయం సాధించింది. ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్లో ఆతిథ్య న్యూజిలాండ్ 44 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం) విజయం సాధించింది. వర్షం కారణంగా మ్యాచ్ను 30 ఓవర్లకు కుదించగా.. తొలుత న్యూజిలాండ్ 7 వికెట్లు కోల్పోయి 239 పరుగులు చేసింది. ఓపెనర్ విల్ యాంగ్ (105; 14 ఫోర్లు, 4 సిక్సర్లు), కెప్టెన్ టామ్ లాథమ్ (92; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. బంగ్లా బౌలర్లలో షరీఫుల్ రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 30 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 200 పరుగులకు పరిమితమైంది. అనాముల్ హక్ (43), అఫిఫ్ (38) పోరాడినా ఫలితం లేకపోయింది. కివీస్ బౌలర్లలో సోధి, క్లార్సన్, మిల్నే తలా రెండు వికెట్లు పడగొట్టారు. విల్ యాంగ్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య బుధవారం రెండో వన్డ జరగనుంది.