ఆక్లాండ్: న్యూజిలాండ్ వెటరన్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 2009లో జాతీయ జట్టులోకి వచ్చిన గప్టిల్.. బుధవారం 14 ఏండ్ల సుదీర్ఘ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. చివరిసారిగా కివీస్ తరఫున 2022లో ఆడిన అతడు.. మూడు ఫార్మాట్లలో కలిపి 367 మ్యాచ్‌లలో ప్రాతినిధ్యం వహించాడు.
న్యూజిలాండ్ తరఫున వన్డేలలో ద్విశతకం చేసిన తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కిన ఈ విధ్వంసక ఓపెనర్.. 198 వన్డేలు, 122 టీ20లు, 47 టెస్టులు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి గప్టిల్ ఖాతాలో 23 శతకాలున్నాయి. వన్డేలలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లలో న్యూజిలాండ్ నుంచి రాస్ టేలర్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తర్వాత గప్టిల్ మూడోస్థానం (7,346)లో ఉన్నాడు. టీ20లలో 3,533 పరుగులతో కివీస్ నుంచి మొదటి స్థానంలో నిలిచాడు.