చెన్నై: పొట్టి ప్రపంచకప్‌ను న్యూజిలాండ్ ఘనంగా ఆరంభించింది. ఆదివారం చెన్నైలో ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగిన గ్రూప్-డీ నాలుగో మ్యాచ్‌లో కివీస్.. ప్రత్యర్థిని 5 వికెట్ల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ తమ ముందుంచిన 183 పరుగుల ఛేదనను బ్లాక్ క్యాప్స్ 17.5 ఓవర్లలోనే దంచేసింది. ఓపెనర్ టిమ్ సీఫర్ట్ (42 బంతుల్లో 65, 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌కు తోడు గ్లెన్ ఫిలిప్స్ (25 బంతుల్లో 42, 7 ఫోర్లు, 1 సిక్స్), మార్క్ చాప్మన్ (17 బంతుల్లో 28, 2 ఫోర్లు, 1 సిక్స్), డారిల్ మిచెల్ (14 బంతుల్లో 25, 1 ఫోర్, 1 సిక్స్) రాణించారు.
ఈ మెగా టోర్నీ చరిత్రలో కివీస్‌కు ఇదే అత్యుత్తమ ఛేదన (అంతకుముందు ఇంగ్లండ్‌పై 167) కావడం విశేషం. ఛేదనలో 14 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయిన కివీస్.. తర్వాత సీఫర్ట్, ఫిలిప్స్ బాదుడుతో పుంజుకుంది.
ఈ ఇద్దరూ 46 బంతుల్లోనే 74 రన్స్ జోడించారు. తర్వాత ఫిలిప్స్ నిష్క్రమించినా.. సీఫర్ట్, చాప్మన్ నాలుగో వికెట్‌కు విలువైన 36 రన్స్ జోడించారు. అర్ధ శతకం తర్వాత సీఫర్ట్‌ను నబీ ఔట్ చేసినా మిచెల్, కెప్టెన్ శాంట్నర్ (17*) లాంఛనాన్ని పూర్తిచేశారు.
మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్.. ఆరంభంలో తడబడినా గుల్బాదిన్ నయీబ్ (35 బంతుల్లో 63, 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్ ఆటతో మెరుగైన స్కోరు చేసింది. సెదికుల్లా (29), గుర్బాజ్ (27) అతడికి అండగా నిలిచారు. టీ20ల్లో ప్రత్యర్థి ఎదుట 180+ టార్గెట్‌ను ఉంచి ఓడటం 26 మ్యాచ్‌ల్లో ఆఫ్ఘానిస్థాన్కు ఇదే ప్రథమం.