ప్రతిష్టాత్మక లార్డ్స్ టెస్టులో ఇంగ్లాండ్-న్యూజిలాండ్ మధ్య గురువారం ప్రారంభమైన తొలి టెస్టు లో బౌలర్లు పండుగ చేసుకున్నారు. పిచ్ నుంచి అందుతున్న సహకారంతో ఫాస్ట్ బౌలర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఇరు జట్ల బౌలర్లు కలిసి ఏకంగా 17 వికెట్లు నేలకూల్చారు. ఇందులో కివీస్ ఆలౌట్ అవగా.. ఇంగ్లాండ్ మూడు వికెట్లతో ఆ గండం నుంచి గట్టెక్కింది. బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టిన లార్డ్స్ టెస్టులో ఇవే పరిస్థితులు కొనసాగితే పలితం తేలడానికి మూడు రోజుల కంటే ఎక్కువ సమయం పట్టకపోవచ్చు.
కొత్త కెప్టెన్ (బెన్ స్టోక్స్), కొత్త కోచ్ (బ్రెండన్ మెక్ కల్లమ్) లతో తిరిగి పూర్వ వైభవాన్ని అందుకోవాలనే లక్ష్యంతో న్యూజిలాండ్ తో టెస్టును ప్రారంభించిన ఇంగ్లాండ్ కు వెటరన్ బౌలర్లు జేమ్స్ అండర్సన్, స్టువర్ట్ బ్రాడ్ తో పాటు అరంగేట్ర బౌలర్ మాథ్యూ పాట్స్ కూడా అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు.
వీళ్ల ధాటికి టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుని తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్.. 40 ఓవర్లలోనే 132 పరుగులకు ఆలౌట్ అయింది. అండర్సన్ (4-66), మాథ్యూ పాట్స్ (4-13) తో చెలరేగగా.. బ్రాడ్, స్టోక్స్ తలో వికెట్ పడగొట్టారు. కివీస్ బ్యాటర్లలో గ్రాండ్ హోమ్ (42) టాప్ స్కోరర్. సౌథీ (26) ఆదుకున్నాడు. లాథమ్ (1),విల్ యంగ్ (1), కెప్టెన్ కేన్ విలిమయ్సన్ (2), కాన్వే (3), డారిల్ మిచెల్ (13), బ్లండెల్ (14) లు దారుణంగా విఫలమయ్యారు.
కివీస్ ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన ఆనందం ఇంగ్లాండ్ కు ఎంతో సేపు నిలువలేదు. తొలి వికెట్ కు 59 పరుగులు జోడించిన ఇంగ్లాండ్.. ఆ తర్వాత క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. పోప్ (7), జో రూట్ (11), బెయిర్ స్టో (1), బెన్ స్టోక్స్ (1) లు అలా వచ్చి ఇలా వెళ్లారు. కివీస్ బౌలర్లలో సౌథీ, బౌల్ట్, జెమీసన్ లు చెరో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్.. కివీస్ కంటే ఇంకా 16 పరుగులు వెనుకబడి ఉంది.