నెల్సన్(న్యూజిలాండ్) : వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ ముందంజ వేసింది. ఆదివారం జరిగిన మూడో టీ20లో కివీస్ 9 పరుగుల తేడాతో విండీస్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. మరో రెండు మ్యాచ్‌లు మిగిలున్న సిరీస్‌లో కివీస్ ప్రస్తుతం 2-1 ఆధిక్యంలో కొనసాగుతున్నది. కివీస్ నిర్దేశించిన 178 పరుగుల లక్ష్యఛేదనలో విండీస్ 19.5 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌటైంది. విజయానికి ఆరు బంతుల్లో 12 పరుగులు అవసరమైన దశలో కైల్ జెమీసన్(1/35) మ్యాచ్‌ను మలుపుతిప్పాడు.
తన అద్భుత బౌలింగ్‌తో జెమీసన్ ఐదు బంతుల్లో రెండు పరుగులే ఇచ్చి రొమారియో షెఫర్డ్ వికెట్ తీసి కివీస్‌కు విజయాన్ని అందించాడు. జాకబ్ డఫీ (3/36), ఇష్ సోధి(3/34) మూడేసి వికెట్లు తీశారు. తొలుత డేవాన్ కాన్వె (56) అర్ధషెంచరీకి తోడు డారిల్ మిచెల్ (41) రాణించడంతో కివీస్ 20 ఓవర్లలో 177/9 స్కోరు చేసింది. మాథ్యూ ఫోర్డె (2/20), జాసన్ హోల్డర్ (2/31) రెండు వికెట్లు పడగొట్టారు. సోధీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.