అక్టోబర్ 20, 2024..న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో మరుపురాని రోజు. ఓవైపు పురుషుల జట్టు 36 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌లో భారత్‌పై టెస్టుల్లో చారిత్రక విజయం సాధిస్తే..మరోవైపు తామేం తక్కువ కాదన్నట్లు మహిళలు కొత్త చరిత్ర లిఖించారు. ఏండ్లుగా ఊరిస్తూ వస్తున్న టీ20 ప్రపంచకప్ టోర్నీని ఎట్టకేలకు ఒడిసిపట్టుకున్నారు.
మెగాటోర్నీకి ముందు వరుస పరాజయాలతో కనీసం లీగ్ దశనైనా దాటుతుందా అన్న అంచనాలను తలక్రిందులు చేస్తూ పొట్టి ప్రపంచకప్‌లో నయా చాంపియన్‌గా నిలిచింది. ఆదివారం ఫైనల్లో నిరుటి రన్నరప్ దక్షిణాఫ్రికాను మట్టికరిపిస్తూ కివీస్ తొలిసారి ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది. అమెలియా కెర్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కివీస్ చారిత్రక విజయంలో కీలకమైంది.
T20 World Cup | దుబాయ్: న్యూజిలాండ్ మహిళల జట్టు కొత్త చరిత్ర లిఖించింది. కలగా మిగిలిన ఐసీసీ ట్రోఫీని ఎట్టకేలకు నెరవేర్చుకుంది. ఆదివారం జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ 32 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. తొలుత న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 158/5 స్కోరు చేసింది. అమెలియా కెర్(38 బంతుల్లో 43, 4ఫోర్లు), బ్రూక్ హాలిడే(38), సుజి బేట్స్ (32) రాణించారు. మాల్బా(2/31)రెండు వికెట్ల తీయగా, కాకా, ట్రైయాన్, డికెర్ల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 126/9 స్కోరుకు పరిమితమైంది.
అమెలియా కెర్ (3/24), రోసిమెరీ(3/25) మూడు వికెట్లతో సఫారీల పతనాన్ని శాసించారు. కెప్టెన్ లారా వోల్వార్డ్(33) మినహా అందరూ ఘోరంగా విఫలమయ్యారు. ఛేదనలో తొలుత దూకుడుగా ఆడిన దక్షిణాఫ్రికా..లారా నిష్క్రమణ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి మరోమారు తాము చోకర్స్ అని చేతల్లో చూపెట్టింది. అమెలియా కెర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ దక్కించుకుంది. 2009, 2010లో రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ ఎట్టకేలకు 14 ఏండ్ల తర్వాత తమ చిరకాల కలను సాకారం చేసుకుంది.
అంచనాలు లేకుండా బరిలోకి దిగి న్యూజిలాండ్ అద్భుతం చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన కివీస్..సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది. 16 పరుగులకే జార్జియా(9) వికెట్ కోల్పోయిన కివీస్..బేట్స్, కెర్ బ్యాటింగ్‌తో గాడిలో పడింది. వీరిద్దరు సఫారీ బౌలింగ్ దాడిని సమర్థంగా నిలువరిస్తూ పరుగులు కొల్లగొట్టారు. రెండో వికెట్‌కు వీరిద్దరు కలిసి 37 పరుగులు జోడించారు. కెప్టెన్ డివైన్(6) నిరాశపరిచినా..బ్రూక్‌తో కలిసి కెర్ ఇన్నింగ్స్‌ను మళ్లీ చక్కదిద్దింది. సమయోచిత ఆటతీరుతో స్కోరుబోర్డుకు కీలక పరుగులు జతచేసింది. 14 పరుగుల తేడాతో వీరద్దరు ఔటైనా కివీస్ పోరాడే స్కోరు అందుకుంది.
న్యూజిలాండ్: 20 ఓవర్లలో 158/5(కెర్ 43, బ్రూక్ 38, మాల్బా 2/31, డిక్లెర్క్ 1/17), దక్షిణాఫ్రికా: 20 ఓవర్లలో 126/9(వోల్వార్డ్ 33, బ్రిట్స్ 17, కెర్ 3/24, రోసిమెరీ 3/25)