IPL | ముంబై : బ్యాటర్లు ఆధిపత్యం చెలాయించే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 18వ సీజన్‌కు ముందు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బౌలర్లకు శుభవార్త చెప్పింది. బంతికి లాలాజలం (ఉమ్మి) రాయడంపై ఉన్న నిషేధాన్ని ఎత్తేసింది. శనివారం నుంచి మొదలుకాబోయే ఐపీఎల్-18వ సీజన్ నుంచి ఈ నిబంధన అమలులోకి రానుంది. ముంబైలో జరిగిన కెప్టెన్ల సమావేశంలో బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. బోర్డు ప్రతిపాదనకు మెజారిటీ సారథులు అంగీకారం తెలిపారు. బంతిని రివర్స్ స్వింగ్ చేసే క్రమంలో బౌలర్లు బంతికి ఉమ్మి రాయడం గతంలో కొనసాగింది. కానీ కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఐసీసీ దీనిపై నిషేధాన్ని విధించింది. 2022లో ఆ నిర్ణయాన్ని శాశ్వతం చేసింది. అయితే దీనికి వ్యతిరేకంగా ఇటీవల కాలంలో ప్రస్తుతం ఆడుతున్న బౌలర్లతో పాటు మాజీలు సైతం గళమెత్తారు. చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా భారత పేసర్ మహ్మద్ షమీ ఈ అంశాన్ని ప్రస్తావించగా.. దక్షిణాఫ్రికా మాజీ పేసర్ ఫిలాండర్, కివీస్ దిగ్గజం టిమ్ సౌథీ కూడా అతడికి మద్దతు ప్రకటించారు. కాగా ఐసీసీ దీనిపై ఏ విధమైన ప్రకటన చేయకపోయినప్పటికీ ఉమ్మిపై నిషేధాన్ని ఎత్తేసిన తొలి మేజర్ క్రికెట్ బోర్డుగా బీసీసీఐ నిలిచింది. బీసీసీఐ నిర్ణయంతో ఐసీసీ కూడా త్వరలోనే దీనిపై పునరాలోచించే అవకాశం లేకపోలేదు.
సలైవాపై నిషేధంతో పాటు మరిన్ని కీలక ప్రతిపాదనలకు బీసీసీఐ పచ్చజెండా ఊపింది. సెకండ్ ఇన్నింగ్స్‌లో బంతిని మార్చుకునేందుకు సారథులకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం రాత్రి పూట జరిగే మ్యాచ్‌లలో సెకండ్ ఇన్నింగ్స్ 11వ ఓవర్ తర్వాత బంతిని మార్చుకునేందుకు సారథికి అవకాశముంటుంది. అయితే పాత బంతి ఏ స్థితిలో ఉందో అలాంటి బంతినే తీసుకునేందుకు ఫీల్డింగ్ టీమ్ కెప్టెన్.. అంపైర్‌ను అడిగే హక్కును కల్పించారు. రాత్రి మ్యాచ్‌లకు మంచు ప్రభావం ఎక్కువగా ఉండే నేపథ్యంలో బంతిపై బౌలర్లకు పట్టు చిక్కేందుకు గాను ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడనుంది. అయితే బంతిని మార్చే విషయంలో అంపైర్ తన విచక్షణతో తుది నిర్ణయం తీసుకుంటాడని బోర్డు తెలిపింది.
స్లో ఓవర్ రేట్ కారణంగా సారథులపై నిషేధం విధించే విధానానికి బీసీసీఐ స్వస్తి పలికింది. స్లో ఓవర్ రేట్‌కు డీమెరిట్ పాయింట్లు, జరిమానా అధికంగా విధించనుండగా మరీ తీవ్రమైన పరిస్థితుల్లో మాత్రమే ఒక మ్యాచ్ నిషేధాన్ని అమలు చేయనున్నారు.