ODI World Cup | ప్రపంచకప్-2023 టోర్నీలో భాగంగా శనివారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టుపై నెదర్లాండ్స్ ఘన విజయం సాధించింది. 87 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ని చిత్తుగా ఓడించింది. 230 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 42.2 ఓవర్లలోనే 142 పరుగులకే ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్ టీంలో టాప్ బ్యాటర్లలో మెహదీ హసన్ మిరాజ్ 35, తాంజిద్ హసన్ 15 పరుగులు మినహా, లిట్టన్ దాస్ 3, నజ్ముల్ హుస్సేన్ శాంటో 9, షకీబ్ అల్ హసన్ 5, ముష్ఫికర్ రహీం 1 పరుగుతో గోరంగా విఫలం అయ్యారు. మహమ్దుల్లా 20, మెహదీ హసన్ 17 పరుగులు చేశారు.
230 పరుగుల విజయ లక్ష్య సాధనలో బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. ఏమాత్రం నిలబడలేకపోయింది. తొలుత నెమ్మదిగా బ్యాటింగ్ చేసిన లిట్టన్ దాస్‌ను నాలుగో ఓవర్లో ఆర్యన్ దత్ పెవిలియన్ కు పంపాడు. ఐదో ఓవర్లో వాన్ బీక్ బౌలింగ్‌లో తాంజిద్ హసన్ ఔటయ్యాడు. లిట్టన్ దాస్, తాంజిన్ హసన్ లను కీపర్ ఎడ్వర్డ్ ఔట్ చేయడం ఆసక్తికర పరిణామం. వారి తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన నజ్ముల్, షకీబ్ ఎక్కువ సేపు నిలవలేకపోయారు. అటుపై వచ్చిన హసన్ మిరాజ్ నిలకడగా బంతిని బౌండరీల బాట పట్టించినా బాస్ డీ లీడే ఔట్ చేస్తే, ముష్పికర్ రహీంను వాన్ మీకేరెన్ క్లీన్ బౌల్డ్ చేయడంతో 70 పరుగులకే బంగ్లాదేశ్ ఆరు వికెట్లు కోల్పోయింది.
హసన్ మిరాజ్, ముష్ఫికర్ రహీం తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన మహ్మదుల్లా, మెహదీ హసన్ నిలకడగా ఆడుతు జట్టు స్కోర్ సెంచరీ మార్క్ దాటించారు. కానీ వీరిద్దరూ వెంటవెంటనే ఔట్ అయ్యారు. బాస్ డీ లీడే బౌలింగ్‌లో ఆర్యన్ దత్‌కు మహ్మదుల్లా చిక్కాడు. హసన్ మిరాజ్ రనౌట్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన ముస్తాఫిజుర్ 35 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 20 పరుగులు చేసిన ప్రయోజనం లేకపోయింది. నెదర్లాండ్స్ బౌలర్లలో పాల్ వాన్ మీకెరెన్ నాలుగు, బాస్ డీలీడే రెండు, ఆర్యన్ దత్, వాన్ బీక్, అకెర్మాన్ తలో వికెట్ తీశారు.
తొలతు బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 50 ఓవర్లలో 229 పరుగులు చేసింది. స్కాట్ ఎడ్వర్డ్స్ 68, వెస్లీ బరేసి 41, సిబ్రాండ్ ఎంగెల్ బ్రెచ్డ్ 35 పర్వాలేదనిపించారు. ఓపెనర్లు విక్రమ్ జిత్ సింగ్ మూడు, మాక్స్ ఔడెడ్ డకౌట్ అయ్యారు. కోలిన్ అకెర్మాన్ 15, బాస్ డీ లీడే 17 పరుగులు చేశారు. చివర్లో వాన్ బీక్ 23 పరుగులు చేసి చివరి బంతికి ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ బాట పట్టడంతో నెదర్లాండ్స్ ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కిన్ అహ్మద్, షోరిపుల్ ఇస్లాం, ముస్తాఫిజుర్ రహ్మన్, మెహదీ హసన్ రెండేసీ వికెట్లు, షకీబ్ అల్ హసన్ ఒక వికెట్ తీశారు.