BCCI | నేపాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాన్) కు ఇచ్చిన మాటను బీసీసీఐ నిలబెట్టుకుంది. ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సమీపిస్తున్న వేళ తమను ఆదుకోవాలని, తమ క్రికెటర్లకు భారత్‌లో శిక్షణ ఇప్పించాలని కోరిన క్యాన్ అభ్యర్థనకు బీసీసీఐ సానుకూలంగా స్పందించింది. ఆర్థిక ఇబ్బందులతో పాటు వాతావరణ పరిస్థితుల కారణంగా తమ క్రికెటర్లకు భారత్‌లో ట్రైనింగ్‌తో పాటు ఇక్కడ మ్యాచ్‌లు ఆడించాలని గత నెలలో క్యాన్.. బీసీసీఐని కోరింది. ఈ ఏడాది అమెరికా – వెస్టిండీస్ వేదికలుగా జరుగనున్న టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొననున్న నేపాల్‌కు ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని కోరిన క్యాన్‌కు బీసీసీఐ ఆపన్నహస్తం అందించింది. దేశవాళీ క్రికెట్లో భాగంగా గతేడాది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ రన్నరప్ అయిన బరోడాతో పాటు పటిష్టమైన గుజరాత్ జట్టుతో నేపాల్ ముక్కోణపు సిరీస్ ఆడనుంది.
ఈ మేరకు క్యాన్ తాజాగా షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. ఫ్రెండ్షిప్ కప్‌గా నామకరణం చేసిన ఈ ట్రై సిరీస్‌లో నేపాల్.. గుజరాత్, బరోడాతో నాలుగు మ్యాచ్‌లు ఆడనుంది. మార్చి 31న మొదలయ్యే ఈ సిరీస్ ఏప్రిల్ 7న ముగుస్తుంది. టీ20 ఫార్మాట్లో ఈ సిరీస్ జరుగనుంది. గ్రూప్ స్టేజ్‌లో నేపాల్.. బరోడా, గుజరాత్‌లతో రెండేసి మ్యాచ్‌లు ఆడనుంది. గుజరాత్‌లోని వాపిలో ఈ మ్యాచ్‌లు జరుగుతాయి. బరోడా జట్టుకు హార్ధిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యా సారథిగా వ్యవహరిస్తుండగా గుజరాత్ జట్టులో పియుశ్ చావ్లా, యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ వంటి టాలెంటెడ్ క్రికెటర్లున్నారు.
Mark your calendars! 🗓️ Friendship Cup T20 Tri-Series kicks off on March 31st, as Nepal, Gujarat @GCAMotera, and Baroda @cricbaroda clash in Vapi. 🔥#OneBallBattles | #NepalCricket #HappyDressingRoom | #WorldCupYear2024 pic.twitter.com/awtcy6YBap
— CAN (@CricketNep) February 19, 2024
ఈసారి టీ20 వరల్డ్ కప్‌లో 20 జట్లు పాల్గొంటున్న విషయం విదితమే. అందులో నేపాల్ కూడా ఉంది. అయితే ప్రస్తుతం నేపాల్‌లో ఆటగాళ్లు పూర్తిస్థాయిలో ప్రాక్టీస్ చేసుకునేందుకు మౌళిక సదుపాయాల కల్పన అంతంతమాత్రంగానే ఉంది. దానికి తోడు వాతావరణ పరిస్థితులు కూడా అక్కడ ఆటగాళ్లకు అనుకూలంగా లేవు. ఆటగాళ్లకు గాయాలైనా వారికి పూర్తిస్థాయిలో వైద్యం అందించే సదుపాయాలు కూడా క్యాన్ వద్ద లేవు. ఈ నేపథ్యంలో గత నెలలో క్యాన్.. బీసీసీఐ కార్యదర్శి జై షా ను కలిసి సాయం కోరింది. క్యాన్ కోరినట్టుగానే బీసీసీఐ.. నేపాల్ క్రికెటర్లకు ట్రై సిరీస్‌తో పాటు ట్రైనింగ్ క్యాంప్‌లను ఏర్పాటుచేయనుందని బోర్డు వర్గాల సమాచారం.