విరిసిన క్రీడా పద్మాలు

- జఝారియాకు పద్మభూషణ్, నీరజ్‌కు పద్మశ్రీ
న్యూఢిల్లీ: క్రీడా పద్మాలు విరబూసాయి. అంతర్జాతీయ క్రీడా వేదికలపై దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసిన క్రీడా తారలు తళుక్కుమన్నాయి. ప్రతిభకు తగిన గుర్తింపునిస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం పద్మ అవార్డులను ప్రకటించింది. మొత్తం 128 అవార్డులు ప్రకటించగా, వివిధ రాష్ర్టాల నుంచి తొమ్మిది మందిని క్రీడల నుంచి ఎంపిక చేసింది. తన వైకల్యాన్ని లెక్కచేయకుండా పారాలింపిక్స్‌లో పతకాలు కొల్లగొడుతున్న రాజస్థాన్‌కు చెందిన జావెలిన్ త్రోయర్ దేవేంద్ర జఝారియా దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యాడు. ఏథేన్స్ (2004), రియో (2016) విశ్వక్రీడల్లో స్వర్ణ పతకాలతో మెరిసిన దేవేంద్ర..గతేడాది టోక్యో(2020)లో జరిగిన పారాలింపిక్స్‌లో రజత పతకాన్ని దక్కించుకున్నాడు. ఎనిమిదేండ్ల ప్రాయంలో కరెంట్ షాక్‌తో ఎడమచేతిని కోల్పోయిన దేవేంద్ర జావెలిన్ త్రోలో చిరస్మరణీయ విజయాలు సొంతం చేసుకున్నాడు.
తన వైకల్యాన్ని అధిగమిస్తూ విశ్వక్రీడలతో పాటు ప్రతిష్ఠాత్మక ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, రజతంతో పాటు ఆసియా పారా గేమ్స్‌లో వెండి పతకంతో మెరిశాడు. మిగతా అవార్డుల విషయానికొస్తే..టోక్యో ఒలింపిక్స్‌లో పసిడి వెలుగులు విరజిమ్మిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు పద్మశ్రీ పురస్కారం వరించింది. వందేండ్ల భారతీయుల కలను సాకారం చేస్తూ టోక్యో గడ్డపై త్రివర్ణ పతాకాన్ని నీరజ్ రెపరెపలాడించాడు. ప్రస్తుతం అమెరికాలో శిక్షణ పొందుతున్న నీరజ్..పద్మశ్రీతో పాటు పరమ విశిష్ట పురస్కారం దక్కడంపై ట్విట్టర్లో స్పందించాడు. ‘రెండు అత్యున్నత పురస్కారాలకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ ఆశీర్వాదాలు, మద్దతు వల్ల భవిష్యత్‌లో దేశం తరఫున మరింత కష్టపడి మెరుగైన ఫలితాలు సాధిస్తాను’అని ట్వీట్ చేశాడు.
టోక్యో పారాలింపిక్స్‌లో స్వర్ణం సహా కాంస్య పతకంతో మెరిసిన యువ షూటర్ అవనీ లేఖరాకు పద్మశ్రీ అవార్డు దక్కింది. పసిప్రాయం నుంచే చక్రాల కుర్చీకే పరిమితమైన అవని..టోక్యోలో తన గురికి తిరుగులేదని చాటిచెప్పింది. ప్రమోద్ భగత్ (పారా బ్యాడ్మింటన్), సుమిత్ అంటిల్ (పారా జావెలిన్ త్రో)తో పాటు కలరీపట్టు విద్యలో దిగ్గజమైన కేరళకు చెందిన శంకరనారాయణ మీనన్, ఫైజల్ అలీదార్ (మార్షల్ ఆర్ట్స్), బ్రహ్మానంద్ సాన్వాల్కర్ (ఫుట్‌బాల్), వందనా కటారియా (హాకీ) పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. వీరంతా రాష్ట్రపతి భవన్ వేదికగా జరిగే కార్యక్రమంలో అవార్డులు అందుకోనున్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

