World Athletics Championships : ఆసియా కప్‌లో భారత క్రికెటర్లు పాకిస్థాన్ ఆటగాళ్లతో ‘హ్యాండ్ షేక్’ చేయకపోవడంపై పెద్ద చర్చే నడుస్తోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాన్ని తాము శత్రువుగానే చూస్తామని టీమిండియా ప్లేయర్లు పాక్ టీమ్‌తో కరచాలనం నిరాకరించారు. ఈ విదాదం ముగిసే లోపే వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ (World Athletics Championships) జావెలిన్ త్రో ఫైట్ వచ్చేసింది. సెప్టెంబర్ 17 బుధవారమే క్వాలిఫయింగ్ రౌండ్ జరుగనుంది. దాంతో.. భారత స్టార్ నీరజ్ చోప్రా(Neeraj Chopra), పాక్ అథ్లెట్ అర్షద్ నదీమ్(Arshad Nadeem) మధ్య ఎవరిది పైచేయి అవుతుంది? అని అందరూ ఆసక్తితో ఉన్నారు. అయితే.. నిర్వాహకులు మాత్రం అభిమానులకు షాకిచ్చారు. ఎలాగంటే..?
టోక్యో వేదికగా జరుగుతున్న వరల్డ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో జావెలిన్ క్వాలిఫయింగ్ రౌండ్ బుధవారం జరుగనుంది. అందరూ ఊహించినట్టుగా నీరజ్ చోప్రా, అర్షద్ నదీమ్‌ల మధ్య ఎలాంటి పోటీ ఉండడం లేదు. ఎందుకంటే ఇరువురు వేర్వేరు గ్రూప్‌లో ఉండడమే అందుకు కారణం.
Neeraj Chopra vs Arshad Nadeem, a battle between the best! Who will come out on top this time at the World Athletics Championships 2025?
[2/3] pic.twitter.com/gx9iZ60K8S
— ESPN India (@ESPNIndia) September 12, 2025
అవును.. నీరజ్ గ్రూప్ ఏలో ఉండగా.. నదీమ్ గ్రూప్ బీ నుంచి బరిలోకి దిగుతున్నాడు. ఫైనల్‌కు క్వాలిఫయింగ్ దూరం 84.50 మీటర్లుగా నిర్ణయించారు. ఈ మార్క్ అందుకున్న 12 మంది బడిసె వీరులు ఫైనల్‌కు దూసుకెళ్తారు. ఒకవేల చోప్రాతో పాటు నీరజ్ కూడా అర్హత సాధిస్తే గురువారం నిర్వహించే ఫైనల్లో ఇద్దరూ తలపడే అవకాశముంది. అదేజరిగితే పారిస్ ఒలింపిక్స్ ఫైనల్లో చివరిసారిగా ఎదురుపడిన ఈ ఇద్దరూ మరోసారి ఢీ అంటే ఢీ అనడం ఖాయం.
గ్రూప్ ఏ : నీరజ్ చోప్రా, సచిన్ యాదవ్, జులియన్ వెబర్, జాకుబ్ వద్లెచ్, సుమేద రణసింగే, ఇతరులు.
గ్రూప్ బీ : అర్షద్ నదీమ్, రుమేశ్ పథిరగే, అండర్సన్ పీటర్స్, జులియస్ యెగో, రోహిత్ యాదవ్, యశ్వీర్ సింగ్.. తదితరులు.
ఈ సీజన్లో భీకర ఫామ్‌లో ఉన్న నీరజ్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్స్‌లో టైటిల్ నిలబెట్టుకునేందుకు సర్వశక్తులు ఒడ్డనున్నాడు. ఈసారి కూడా అగ్రస్థానంలో నిలిస్తే భారత స్టార్ అరుదైన క్లబ్లో చేరుతాడు. ఇదివరకూ జాన్ జెలెంజీ (1993, 1995), అండర్సన్ పీటర్స్(2019, 2022)లు మాత్రమే రెండు పర్యాయాలు టైటిల్ సాధించారు. ఒలింపిక్స్‌లో వరుసగా పతకాలతో నీరజ్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
ఆసియా కప్ గ్రూప్ దశ మ్యాచ్‌లో భారత జట్టు చేతిలో చిత్తుగా ఓడింది పాకిస్థాన్. 128 పరుగుల లక్ష్య ఛేదనను సిక్సర్‌తో పూర్తి చేసిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) వెనక్కి తిరిగి చూడకుండా శివం దూబేతో కలిసి డగౌట్‌కు వచ్చేశాడు. ఆనవాయితీ ప్రకారం ప్రత్యర్థి ఆటగాళ్లకు ఇవ్వాల్సిన షేక్ హ్యాండ్ సంప్రదాయాన్ని పాటించలేదు సూర్య. దాంతో.. మ్యాచ్ రిఫరీని మార్చాలంటూ పాక్ బోర్డు గగ్గోలు పెట్టింది. అయినా సరే జై షా నేతృత్వంలోని అంతర్జాతీయ క్రికెట్ మండలి మాత్రం పట్టించుకోలేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ రిఫరీని మార్చేది లేదని పీసీబీకి తెగేసి చెప్పింది.