Navjot Sidhu | ఆస్ట్రేలియాతో నిర్ణయాత్మక సిడ్నీ టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యాడు. టీమిండియాకు వరుస ఓటములతో పాటు రోహిత్ ప్లాఫ్ షో నేపథ్యంలో అతన్ని మేనేజ్మెంట్ పక్కన పెట్టాలని నిర్ణయించినట్లు ప్రచారం జరిగింది. చివరకు సిడ్నీ టెస్టులకు దూరం కావడంతో కావాలనే తప్పించారా? లేదంటే రోహిత్ స్వయంగా తప్పుకున్నాడా? అన్న విషయంలో స్పష్టత లేదు. టాస్ సమయంలో మ్యాచ్‌కు దూరంగా ఉండాలని రోహిత్ నిర్ణయించుకున్నాడని బుమ్రా తెలిపాడు. రోహిత్ నిర్ణయంపై పలువురు మాజీ సానుకూలంగా స్పందించగా.. మరికొందరు కెప్టెన్‌ను దారుణంగా అవమానిస్తారా? అంటూ మండిపడ్డారు.
మాజీ క్రికెటర్ నవ్యజ్యోత్ సింగ్ సిద్ధు గంభీర్‌తో పాటు టీమ్ మేనేజ్మెంట్ రోహిత్‌ను తీవ్రంగా అవమానించిందని ఆరోపించారు. చాంపియన్ ప్లేయర్ అయిన రోహిత్‌ను బెంచ్‌కు ఎలా పరిమితం చేస్తారు ? మరీ ఇంత దారుణమా ? ఇంతకన్నా దారుణం మరొకటి ఉండదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్‌ను ఆడించకపోవడం కంటే మరో తప్పు ఉండదని.. ఇది తప్పుడు సంకేతాలను పంపిస్తుందన్నారు. రోహిత్‌కు గౌరవం ఇవ్వాలని.. అతను ఎన్నో విజయాలను జట్టుకు కట్టబెట్టాడని సిద్ధు గుర్తు చేశారు. కెప్టెన్‌ను సిరీస్ మధ్య నుంచి తొలగించడం సరికాదని, తనంతట తానే పక్కకు తప్పుకునేందుకు ముందుకు వచ్చినా.. ఆ అవకాశం ఇవ్వకూడదన్నారు. దాంతో తప్పుడు సంకేతాలు వెళ్తాయని.. మార్క్ టేలర్, మహ్మద్ అజహరుద్దీ వంటి కెప్టెన్లను తాను చాలామందిని చూశానని.. వాళ్లు ఫామ్‌లేమితో సంవత్సరానికిపైగానే టీమ్‌లో కొనసాగారంటూ గుర్తు చేశారు.
రోహిత్‌పై టీమ్ మేనేజ్మెంట్ నమ్మకం ఉంచాల్సిందని.. గౌరవం ఇవ్వాల్సిందని అభిప్రాయపడ్డారు. అవమానకరంగా పక్కన పెట్టడం ఏమాత్రం సరికాదన్నారు. భారత క్రికెట్లో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారని.. ఇంతకంటే ఘోర తప్పిదం మరొకటి లేదంటూ కోచ్ గంభీర్‌పై మాజీ ఆటగాడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సిడ్నీ టెస్టులో రోహిత్ లేకుండానే బరిలోకి దిగిన టీమిండియా దారుణంగా 185 పరుగులకే కుప్పకూలింది. రోహిత్ స్థానంలో చోటు దక్కించుకున్న శుభ్‌మన్ గిల్ కేవలం 20 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ క్రమంలో రోహిత్‌ను పక్కన పెట్టి.. ఏం లాభమని పలువురు మాజీలతో పాటు అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
A Captain should never be dropped midstream nor given the option to opt out … sends wrong signals …. Have seen Captain s like Mark Taylor , Azharuddin etc persisted as captain for a year despite bad form …. @ImRo45 deserved more respect and faith from the management …… pic.twitter.com/OJcSF9r3fU
— Navjot Singh Sidhu (@sherryontopp) January 3, 2025