హైదరాబాద్, ఆట ప్రతినిధి: మహబూబ్‌నగర్ వేదికగా త్వరలో జాతీయస్థాయి సెయిలింగ్ చాంపియన్‌షిప్ నిర్వహిస్తామని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. రాష్ర్టానికి చెందిన సెయిలర్లు ఈ మధ్య కాలంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు కొల్లగొడుతున్నారని అన్నారు. రాష్ట్ర కీర్తి, ప్రతిష్టలను మరింత ఇనుమడింపజేసేలా రాణిస్తున్నారని తెలిపారు.
ఇటీవల షిల్లాంగ్(మేఘాలయ)లో జరిగిన నార్త్ఈస్ట్ రెగెట్టా టోర్నీలో హకీంపేట స్పోర్ట్స్ స్కూల్‌కు చెందిన సంజయ్‌రెడ్డి స్వర్ణం సాధించగా, అశ్విని కాంస్య పతకంతో ఆకట్టుకుంది. మంగళవారం తన క్యాంపు కార్యక్రమంలో సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్తో కలిసి మంత్రి అభనందించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్పోర్ట్స్ స్కూల్‌కు చెందిన విద్యార్థులు సెయిలింగ్‌లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. సెయిలింగ్ కేవలం హైదరాబాద్ వరకే పరిమితం చేయకుండా పాలమూరులో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.