హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): జాతీయ పారా అథ్లెట్ కుడుముల లోకేశ్వరికి రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి భరోసా ఇచ్చారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్ మలక్‌పేటలోని వికలాంగుల సంక్షేమ భవన్లో కోచ్ వేణుతో కలిసి లోకేశ్వరి మర్యాదపూర్వకంగా చైర్మన్‌ను కలిశారు. గతంలో 20వ నేషనల్ పారా అథ్లెటిక్ చాంపియన్‌షిప్ డిసస్ త్రోలో రజత పతకం, 19వ జాతీయ స్థాయి పారా అథ్లెటిక్ షాట్ ఫుట్, డిసస్ త్రో విభాగంలో 2 కాంస్య పతకాలు, మూడవ ఇండియన్ ఓపెన్ పారా అథ్లెటిక్ చాంపియన్‌షిప్ షాట్‌పుట్ విభాగంలో రజతంతో పాటు మూడు సార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకాలను సాధించినట్టు చైర్మన్‌కు ఆమె వివరించారు. పలు సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లగా, వాటి పరిష్కరానికి కృషి చేస్తానని చెప్పారు. లోకేశ్వరి సాధించిన విజయాలపై చైర్మన్ హర్షం వ్యక్తం చేశారు. ఇదే ఆత్మవిశ్వాసంతో అంతర్జాతీయ స్థాయిలో కూడా అద్భుతమైన విజయాలు సాధించాలని ఆశీర్వదించారు.