జడ్చర్ల టౌన్, ఏప్రిల్ 26: నేషనల్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఆదివారం మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మినీ స్టేడియంలో అండర్-17 విభాగం బాలుర జాతీయస్థాయి క్రికెట్ టోర్నీ అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ టోర్నీలో 29 రాష్ర్టాల నుంచి క్రికెట్ జట్లు పాల్గొంటున్నాయి. లీగ్ దశ సందర్భంగా ఆదివారం జరిగిన మొదటి మ్యాచ్లో తెలంగాణ, పుదుచ్చేరి జట్లు తలపడ్డాయి. తొలి పోరులో తెలంగాణ విజేతగా నిలిచింది. రెండో మ్యాచ్లో తమిళనాడు, నవోదయ విద్యాసమితి (ఎన్వీఎస్) జట్లు తలపడగా తమిళనాడు విజయం సాధించింది. స్వామి నారాయణ్ గురుకుల్ పాఠశాల మైదానంలో జరిగిన మొదటి మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్, కేరళ జట్లు తలపడగా కేరళ జయకేతనం ఎగురవేసింది. ఉత్తరాఖండ్, ఐబీఎస్ఎస్వో మధ్య జరిగిన రెండో మ్యాచ్లో ఉత్తరాఖండ్ గెలిచింది. సమర్థ పాఠశాల మైదానంలో గుజరాత్, మధ్యప్రదేశ్ జట్లు తలపడగా మధ్యప్రదేశ్ నెగ్గింది. కర్ణాటక, మహారాష్ట్ర మధ్య జరిగిన రెండో మ్యాచ్లో కర్ణాటక జట్టు విజయం సాధించింది.