కొత్తపల్లి : అఖిల భారత ఓపెన్ కరాటే చాంపియన్షిప్ పోటీలకు కరీంనగర్ సిద్ధమైంది. చీఫ్ మినిస్టర్ కప్-2021 పేరుతో స్థానిక డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్టేడియంలో ఈనెల 19 నుంచి 21 వరకు జరుగనున్న జాతీయస్థాయి కరాటే పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సినీనటుడు సుమన్ ముఖ్య అతిథిగా పాల్గొని పోటీలను ప్రారంభిస్తారని టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ శ్రీనివాస్, మాడుగుల ప్రవీణ్ తెలిపారు. ఈ పోటీలకు 19 రాష్ర్టాల నుంచి సుమారు 1200 మంది క్రీడాకారులు, 300 రిఫరీలు, జడ్జీలు, ఇతర అధికారులు పాల్గొంటున్నట్లు చెప్పారు. క్యాడెట్స్, సబ్ జూనియర్, సీనియర్స్, కటా, కుమిటీ కేటగిరీలలో పోటీలు జరుగుతాయని, విజేతలకు రూ.3 లక్షల వరకు నగదు బహుమతులు, మెమొంటోలు, ప్రశంసాపత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. క్రీడాకారులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించామని, ఉదయం నుంచి సాయంత్రం వరకు పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.