Natasha Stankovic : భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా (Hardhi Pandya), నటాషా స్టాంకోవిక్ (Natasha Stankovic)లు బ్రేకప్ అయి నాలుగు నెలలు దాటుతోంది. అప్పటినుంచి ఒకరికొకరు కలిసింది లేదు. మనసువిప్పి మాట్లాడుకున్నది లేదు. అయితే.. కుమారుడు అగస్త్య (Agastya)కు మాత్రం ఇద్దరూ తమ ప్రేమ పంచుతున్నారు. పాండ్యాతో విడాకులు తీసుకున్నాక స్వదేశం సెర్బియా వెళ్లిపోయిన నటాషా మళ్లీ భారత్ వచ్చేసింది. ముంబై వీధుల్లో కంట పడిన ఆమెను ‘మీరు స్వదేశానికి మకాం మారుస్తున్నారా? అని కొందరు ఫొటోగ్రాఫర్లు అడిగారు. అందుకు నటాషా ఆసక్తికర సమాధానం చెప్పింది. ఇంతకూ ఆమె ఏం అన్నదంటే..?
‘నేను ఎలా స్వదేశం వెళ్లగలను. నాకు ఓ బిడ్డ ఉన్నాడు. అతడు ముంబైలో స్కూల్‌కు వెళుతున్నాడు. హార్దిక్ పాండ్యా, నేను ఓ బిడ్డను కన్నాం. రోజంతా ఎలా గడిచినా.. చివరకు మేము ఒక ఫ్యామిలీ అని అగస్త్య గుర్తు చేస్తూనే ఉంటాడు’ అని నటాషా తెలిపింది. దాంతో, సదరు మీడియా వాళ్లు నాలుక్కరచుకున్నారు. అయితే.. పాండ్యా గురించి తన మనసులో ఏ ఉంది? అనేది మాత్రం నటాషా చెప్పలేదు. దాంతో, ఇదేం ట్విస్ట్.. అంటే త్వరలోనే పాండ్యా, నటాషాలు మళ్లీ ఒకటి అవుతారా ఏంటీ? అని అనుకుంటున్నారంతా.
టీ 20 వరల్డ్ కప్ హీరోగా స్వదేశం వచ్చిన పాండ్యా వ్యక్తిగత జీవితంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు. అందరూ ఊహించినట్టుగానే భార్య నటాషాతో తెగతెంపులు చేసుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో ఏం రాసుకొచ్చాడంటే..? ‘నాలుగేండ్ల దాంపత్య జీవితం తర్వాత పరస్పర ఒప్పందంతో నటాషా, నేను విడాకులకు సిద్ధమయ్యాం. కలిసి బతికేందుకు ఎంతో ప్రయత్నించాం. కానీ, కుదరలేదు.
దాంతో, ఇద్దరి ప్రయోజనాల మేరకు విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మాకు పుట్టిన అగస్త్య ఇక ముందు కూడా మా ఇద్దరి ప్రేమను పొందనున్నాడు. కో పేరెంట్‌గా అతడికి అన్ని సమకూర్చడమే కాకుండా, అతడిని సంతోషంగా ఉంచుతాం. ఈ కష్ట సమయంలో మా గోప్యతకు భంగం కలిగించ వద్దని అభిమానులను కోరుతున్నా’ అని పాండ్యా వెల్లడించాడు.
మోడల్ అయిన నటాషాకు, పాండ్యాకు కరోనా సమయం (Corona Time)లోపెళ్లి అయింది. ప్రస్తుతం ఈ జంటకు అగస్త్య (Agastya) అనే పిల్లాడు ఉన్నాడు. అయితే.. హార్దిక్ – నటాషాలు ఈ మధ్యే రెండోసారి వివాహం చేసుకొని వార్తల్లో నిలిచారు. కొడుకు ఉన్నాక మళ్లీ పెండ్లి చేసకోవడానికి కారణం ఎంటో తెలుసా..? 2020 మార్చి 31న అతికొద్ది మంది సమక్షంలో కోర్టులో హార్దిక్, నటాషాల పెళ్లి జరిగింది.
అది కరోనా టైమ్ కావడంతో సాదాసీదాగా వీళ్లిద్దరూ మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. పరిస్థితులు చక్కబడ్డాక బంధు, మిత్రుల ముందు వైభవంగా మనువాడాలని హార్దిక్, నటాషాలు అప్పుడే నిర్ణయించుకున్నారు. అందుకు ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న ముహూర్తం పెట్టుకున్నారు. ఉదయ్‌పూర్ వేదికగా కన్నులపండువగా వీళ్లు రెండోసారి వివాహం చేసుకున్నారు. కుమారుడు అగస్త్యను ఎత్తుకొని మురిసిపోతూ ఫొటోలు దిగారు. అనుకున్నట్టుగానే తమ పెళ్లిని అందమైన జ్ఞాపకంగా మలచుకున్న విషయం తెలిసిందే.