Thailand Open : థాయ్‌లాండ్ ఓపెన్ ఇంటర్నేషనల్ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత హెవీవెయిట్ బాక్సర్ల జైత్రయాత్ర కొనసాగుతోంది. తొలి రౌండ్ నుంచి అదరగొడుతున్న నమన్ తన్వర్(90 కిలోలు), అన్షుల్ గిల్(90 ప్లస్ కిలోలు) తమ పంచ్ పవర్ చూపిస్తూ ఫైనల్‌కు దూసుకెళ్లారు. గురువారం జరిగిన సెమీ ఫైనల్లో ఈ ఇద్దరూ ఉజ్బెకిస్థాన్ బాక్సర్లను మట్టికరిపించారు.
సెమీస్ విజయంతో స్వర్ణ పతకాన్ని ముద్దాడేందుకు అడుగు దూరంలో నిలిచారు నమన్, అన్షుల్ . కానీ, మహిళా బాక్సర్లు నిరాశపరిచారు. సెమీస్‌లో తమన్నా(51 కిలోలు), ప్రియా(57 కిలోలు), లల్ఫకమవి (80కిలోలు) పోరాడి ఓడిపోయారు. అయితే.. ఈ ముగ్గురికి మరో అవకాశం ఉంది. వీళ్లు కాంస్య పతకం మ్యాచ్‌లో చెలరేగాలని భావిస్తున్నారు.
హెవీ వెయిట్ బాక్సర్ నమన్ సెమీస్‌లోనూ పంజా విసిరాడు. గురువారం 90 కిలోల ఫైట్‌లో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన జురబొఎవ్ ఎలిర్బెక్(Juraboev Elyorbek)ను తన పంచ్‌లతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించిన అతడు 4-1తో గెలుపొంది ఫైనల్లో అడుగుపెట్టాడు.
🥊 Big Wins in the Big Divisions! 🇮🇳
Naman Tanwar (90kg) & Anshul Gill (90+kg) punch their way into the finals at #ThailandOpen2025 with comeback wins over Uzbek pugilists!💥#BFI #PunchMeinHaiDum pic.twitter.com/fif1p6Evyz
— Boxing Federation (@BFI_official) May 29, 2025
అన్షుల్ సైతం తన సత్తా చాటుతూ అదే దేశానికి చెందిన రుస్తమొవ్ అబ్దురఖ్మోన్ను 3-2తో చిత్తుగా ఓడించాడు. జూన్ 1న జరుగబోయే ఫైనల్ కోసం సిద్దమవుతున్నారు నమన్, అన్షుల్. ఈ పోటీలకు 19 మందితో కూడిన ప్రతిభావంతులను పంపింది భారత్. కానీ.. ఇద్దరు మాత్రమే ఫైనల్ చేరడం కొంత నిరాశ కలిగించేదే.