మక్తల్ : భూత్పూర్ రిజర్వాయర్ (Bhutpur reservoir) సామర్ధ్యాన్ని పెంచి సొరంగ మార్గం ( Tunnel route ) ద్వారా నీటిని తరలించేందుకు చర్యలు చేపట్టాలని కాట్రేవ్ పల్లిరైతులు నారాయణపేట అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. కొడంగల్ ఎత్తిపోతల పథకం( Kodangal Lift Irrigation ) నిర్మాణంలో భాగంగా చేపట్టే భూసేకరణలో భూముల కోల్పోతున్న రైతులతో అదనపు కలెక్టర్ రెవెన్యూ సిబ్బందితో కలిసి మక్తల్ మండలంలోని కాట్రేవుపల్లి, ఎర్నాగంపల్లి, మంతన్ గౌడ్, టేకులపల్లి, కాట్వార్ గ్రామాలలో ‘ పునరావాసం -పునరాశ్రయం’ కల్పించేందుకు గురువారం గ్రామ సభలు నిర్వహించారు.
కాట్రేపల్లి గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రైతులు మాట్లాడుతూ గతంలో భూత్పూర్ రిజర్వాయర్ నిర్మాణం వల్ల కాట్రేపల్లి గ్రామానికి చెందిన 300 ఎకరాలకు రైతుల భూములు కోల్పోయ్యామని వివరించారు. ప్రస్తుతం కొడంగల్ ఎత్తిపోతల వల్ల వంద ఎకరాల వరకు భూములు కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం భూత్పూర్ రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచి కాట్రేపల్లి గ్రామ శివారు ముందు భాగం వరకు సొరంగ మార్గం ద్వారా నీటిని తరలించే ప్రక్రియ చేపట్టాలని కోరారు.
అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్ మాట్లాడుతూ రైతుల సమ్మతితోనే భూసేకరణ చేపడతామని వివరించారు. ఏ ఒక్క రైతుకు అన్యాయం చేయబోమని స్పష్టం చేశారు. రైతులకు పూర్తిస్థాయిలో జీవనోపాధి కల్పించడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. భూసేకరణ చట్టం ప్రకారం ప్రతి రైతుకు ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సతీష్ కుమార్, నీటిపారుదల శాఖ అధికారులు సతీష్, నాగ శివ, పంచాయతీ కార్యదర్శులు, రైతులు, తదితరులు ఉన్నారు .