Rafael Nadal : మాజీ వరల్డ్ నంబర్ 1 రఫెల్ నాదల్ (Rafael Nadal) టెన్నిస్‌లో ఓ దిగ్గజం. తన చిరస్మరణీయ ఆటతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన యోధుడు. 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లతో చరిత్ర సృష్టించిన రఫా అనూహ్యంగా ఈమధ్యే టెన్నిస్‌కు వీడ్కోలు పలికాడు. ఆఖరి సారిగా దేశం తరఫున డేవిస్ కప్‌లో ఆడతానని చెప్పాడు.. తాజాగా సౌదీ అరేబియాలో ఆడిన సిక్స్ కింగ్స్ స్లామ్ ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో అతడు నొవాక్ జకోవిచ్ (Novak Djokovic) చేతిలో ఓడిపోయాడు. అనంతరం ‘కోర్టులో మీ ప్రధాన శత్రువు ఎవరు?’ అనే ప్రశ్నకు స్పెయిన్ బుల్ సమాధానం ఏం చెప్పాడంటే..?
‘నా ప్రధాన శత్రువు జకోవిచ్ కాదు. అయితే.. జకోనుs నేను ఎక్కువసార్లు ఎదుర్కొన్నా. కానీ, నావరకైతే నా ఉత్తమ శత్రువు రోజర్ ఫెదరర్. ఎందుకంటే.. నేను టెన్నిస్‌లో గ్రాండ్‌స్లామ్ వేటకు వచ్చేసరికి అతడు టాప్‌లో ఉన్నాడు. అందుకని అతడే నా బెస్ట్ ఎనిమీ’ అని నాదల్ తెలిపాడు. ఈ సందర్బంగా రఫా.. ఫెదరర్‌తో మైదానంలో ‘నువ్వా నేనా ‘అన్నట్టు తలపడిన రోజులు గుర్తు చేసుకున్నాడు.
స్పెయిన్ బుల్గా పేరొందిన నాదల్ టెన్నిస్ దిగ్గజ ఆటగాళ్లలో ఒకడు. రోజర్ ఫెదరర్, ఆండీ రాడిక్, లీటన్ హెవిట్.. వంటి దిగ్గజాలు టెన్నిస్‌ను ఏలుతున్న రోజుల్లో నాదల్ అరంగేట్రం చేశాడు. సంచలనంగా దూసుకొచ్చిన నాదల్ అద్భుత విజయాలతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు.
పదునైన సర్వీస్, బలమైన బ్యాక్ హ్యాండ్ షాట్లతో విరుచుకు పడే రఫా.. దిగ్గజాలకు షాకిస్తూ కెరీర్లో 22 గ్రాండ్‌స్లామ్స్ గెలిచాడు. అయితే.. గాయాలు వెంటాడడంతో కొన్నిరోజులు టెన్నిస్‌కు దూరమయ్యాడు. తొడకండరాల గాయం అతడిని మాటిమాటికీ ఇబ్బంది పెట్టింది. అయినా గోడకు కొట్టిన బంతిలా కోర్టులో అడుగపెట్టడం తనకేమీ కొత్త కాదని నిరూపిస్తూ రాకెట్ అందుకున్నాడు.
ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో గాయం కారణంగా ఆటకు దూరమైన.. ఇక ఎంతోకాలం ఆడలేనని భావించాడు. అయినా సరే కోలుకున్నాక మళ్లీ రాకెట్ అందుకున్నా విజేతగా నిలవలేకపోయాడు. తనకు అచ్చొచ్చిన ఫ్రెంచ్ ఓపెన్ 2024లో రెండో రౌండ్లోనే వెనుదిరిగాడు.
ఆ తర్వాత పారిస్ ఒలింపిక్స్‌లోనూ నాదల్కు జకోవిచ్ చెక్ పెట్టాడు. అంతే.. స్పెయిన్ బుల్ ఇక రిటైర్మెంట్ తీసుకోవాల్సిన సమయం వచ్చేసిందని డిసైడ్ అయ్యాడు. తన ఆటతో ఎందరినో అలరించిన నాదల్ ఆటకు ఇక సెలవంటూ తన సుదీర్ఘ కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టేశాడు.