Cricket | దిగ్విజయంగా యువ భారత జట్టు జైత్రయాత్ర.. సూపర్ సిక్స్‌లో న్యూజిలాండ్ చిత్తు
Cricket | అండర్-19 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన యువ భారత జట్టు అందుకు తగ్గ ప్రదర్శన కనబరుస్తున్నది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ తిరుగులేని విజయాలు అందుకున్న యంగ్ ఇండియా.. ఇప్పుడు సూపర్ సిక్స్‌లోనూ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఉదయ్ సారథ్యంలోని భారత జట్టు 214 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తుచేసింది.
- శతక్కొట్టిన ముషీర్ ఖాన్
- 214 పరుగులతో యువ భారత్ జయభేరి
- న్యూజిలాండ్ 81 ఆలౌట్
- అండర్-19 ప్రపంచకప్
యువ భారత జట్టు జైత్రయాత్ర దిగ్విజయంగా సాగుతున్నది. అండర్-19 ప్రపంచకప్‌లో ఇప్పటికే హ్యాట్రిక్ నమోదు చేసుకున్న యంగ్‌ఇండియా.. ఇప్పుడు సూపర్ సిక్స్‌లో న్యూజిలాండ్‌ను చిత్తుకింద కొట్టింది. ఇటీవల భారత టెస్టు జట్టుకు ఎంపికైన సర్ఫరాజ్ ఖాన్ తమ్ముడు ముషీర్ ఖాన్ అద్భుత సెంచరీతో కదంతొక్కగా.. మిగిలిన వాళ్లు కూడా తలో చేయి వేయడంతో భారీ స్కోరు చేసింది. అనంతరం మన బౌలర్ల ధాటికి కివీస్ ఆటగాళ్లు క్రీజులో నిలువలేకపోవడంతో భారత్ జయకేతనం ఎగరవేసింది.
Cricket | బ్లూమ్‌ఫాంటైన్: అండర్-19 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన యువ భారత జట్టు అందుకు తగ్గ ప్రదర్శన కనబరుస్తున్నది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ తిరుగులేని విజయాలు అందుకున్న యంగ్ ఇండియా.. ఇప్పుడు సూపర్ సిక్స్‌లోనూ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఉదయ్ సారథ్యంలోని భారత జట్టు 214 పరుగుల భారీ తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తుచేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 295 పరుగులు చేసింది. ముషీర్ ఖాన్ (126 బంతుల్లో 131; 13 ఫోర్లు, 3 సిక్సర్లు) ఈ టోర్నీలో రెండో సెంచరీతో చెలరేగగా.. ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (52) అర్ధశతకం నమోదు చేసుకున్నాడు. కెప్టెన్ ఉదయ్ (34) పర్వాలేదనిపించాడు. తెలంగాణ ప్లేయర్ అరవెల్లి అవనీశ్‌రావు (17; 2 సిక్సర్లు) వేగంగా ఆడే ప్రయత్నం చేశాడు. కివీస్ బౌలర్లలో మాసన్ క్లార్క్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో న్యూజిలాండ్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. 28.1 ఓవర్లలో 81 పరుగులకు ఆలౌటైంది. అండర్-19 స్థాయిలో న్యూజిలాండ్‌కు ఇది మూడో అత్యల్ప స్కోరు కాగా.. కెప్టెన్ ఆస్కార్ జాన్సన్ (19) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మన బౌలర్లలో సామీ పాండే 4, ముషీర్ ఖాన్, రాజ్ లింబానీ చెరో రెండు వికెట్లు ఖాతాలో వేసుకున్నారు. ఛేదన తొలి ఓవర్లోనే రాజ్ లింబానీ రెండు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కోలుకోని దెబ్బ కొట్టాడు. సెంచరీ హీరో ముషీర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. సూపర్ సిక్స్‌లో భాగంగా శుక్రవారం జరగనున్న తదుపరి మ్యాచ్‌లో నేపాల్‌తో భారత్ తలపడనుంది.
ఇక్కడ అన్న.. అక్కడ తమ్ముడు!
తాను సాధించలేనిది.. తన కుమారులు అందుకోవాలని ఆశ పడ్డ ఆ మధ్యతరగతి తండ్రి.. ఇప్పుడు ఆనందంలో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఓ వైపు సుదీర్ఘ కాలంగా జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తున్న పెద్ద కొడుకు టీమ్ఇండియాకు ఎంపికైతే.. మరోవైపు చిన్న కుమారుడు అండర్-19 ప్రపంచకప్‌లో సెంచరీల మీద సెంచరీలు బాదుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. కోహ్లీ గైర్హాజరీలో తుది జట్టులో చోటు దక్కించుకొని సత్తాచాటాలని అన్న చూస్తుంటే.. జూనియర్ స్థాయిలో వచ్చిన అవకాశాలను తమ్ముడు రెండు చేతులతో ఒడిసి పట్టుకుంటున్నాడు. ఆ అన్నదమ్ముళ్లు సర్ఫరాజ్‌ఖాన్, ముషీర్ ఖాన్ కాగా.. మురిసిపోతున్న తండ్రి పేరు నౌషద్ ఖాన్. చిన్నప్పటి నుంచే క్రికెట్ ఆశగా శ్వాసగా పెరిగిన ఈ కుటుంబం ప్రస్తుతం ఆనంద డోలికల్లో తేలియాడుతున్నది. దేశవాళీల్లో ముంబై తరఫున దంచికొడుతున్న సర్ఫరాజ్ ఖాన్ ఇంగ్లండ్‌తో రెండో టెస్టు కోసం భారత జట్టుకు ఎంపిక కాగా.. దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్-19 వరల్డ్‌కప్‌లో ముషీర్ ఖాన్ రాణిస్తున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే రెండు సెంచరీలు ఓ అర్ధశతకం సాయంతో మూడొందల పైచిలుకు పరుగులు చేసిన ముషీర్.. అత్యధిక పరుగుల వీరుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అన్నలాగే సుదీర్ఘ సమయం బ్యాటింగ్ చేయగల సామర్థ్యం, మైదానం నలుమూలలా షాట్లు కొట్టగల నైపుణ్యంతో పాటు ఉపయుక్తమైన స్పిన్ బౌలింగ్ కూడా ముషీర్‌ను ప్రత్యేకంగా నిలుపుతున్నది. మెగాటోర్నీలో 18 ఏండ్ల ముషీర్ జోరు చూస్తుంటే.. మున్ముందు కాలంలో సర్ఫరాజ్‌కు జట్టులో చోటు కోసం ఇంటి నుంచే పోటీ మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి!
-నమస్తే తెలంగాణ క్రీడావిభాగం
సంక్షిప్త స్కోర్లు
భారత్: 295/8 (ముషీర్ 131, ఆదర్శ్ 52; క్లార్క్ 4/64),
న్యూజిలాండ్: 28.1 ఓవర్లలో 81 ఆలౌట్ (ఆస్కార్ జాక్సన్ 19; సామీ పాండే 4/19, ముషీర్ 2/10).
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

