ముంబై: తమిళనాడుతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబై భారీ స్కోరు దిశగా సాగుతున్నది. లోయర్ ఆర్డర్ బ్యాటర్ శార్దూల్ ఠాకూర్(105 బంతుల్లో 109, 13ఫోర్లు, 4సిక్స్‌లు) సూపర్ సెంచరీతో కదంతొక్కాడు. కెరీర్లో తొలి సెంచరీ చేసిన శార్దూల్..ముంబై ఆధిక్యంలో నిలుపడంలో కీలకమయ్యాడు. ఆదివారం రెండో రోజు ముగిసే సరికి ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 353-9 స్కోరు చేసింది. లోయార్ ఆర్డర్ బ్యాటర్లు తనుశ్ కొటియాన్(74 బ్యాటింగ్), తుషార్ దేశ్‌పాండే(17 బ్యాటింగ్) క్రీజులో కొనసాగుతున్నారు.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 45-2తో రెండో రోజు ఆట కొనసాగించిన ముంబైని సాయి కిషోర్(6-97), కుల్దీప్సేన్(2-65) దారుణంగా దెబ్బతీశారు. ముషీర్‌ఖాన్(55) అర్ధసెంచరీతో ఆదుకోగా, మోహిత్ అవస్తి(2), రహానే(19), శ్రేయాస్ అయ్యర్(3), ములానీ(0) ఘోరంగా విఫలమయ్యారు. దీంతో 106-7 స్కోరుతో ముంబై పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ తరుణంలో శార్దుల్..ఎనిమిదో వికెట్‌కు హార్దిక్ తోమర్(35)తో కలిసి 105 పరుగులు, తనుష్‌తో తొమ్మిదో వికెట్‌కు 79 పరుగులు జతచేశాడు. ప్రస్తుతం ముంబై 207 పరుగుల కీలక ఆధిక్యంలో కొనసాగుతున్నది.