WPL | ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్)లో ముంబై ఇండియన్స్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. గురువారం జరిగిన ఎలిమినేటర్ పోరులో ముంబై 47 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై ఘన విజయం సాధించింది. తద్వారా రెండోసారి ముంబై ఫైనల్ పోరులో నిలిచింది. ఈనెల 15న తుది పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌తో ముంబై తలపడనుంది. తొలుత హిలీ మాథ్యూస్(50 బంతుల్లో 77, 10ఫోర్లు, 3సిక్స్‌లు), నాట్ సీవర్బ్రంట్(41 బంతుల్లో 77, 10ఫోర్లు, 2సిక్స్‌లు) అర్ధసెంచరీలతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 213/4 స్కోరు చేసింది.
26 పరుగులకే భాటియా(15) వికెట్ కోల్పోయిన ముంబైని మాథ్యూస్, బ్రంట్ ఆదుకున్నారు. ఒకరిని మించి మరొకరు బౌండరీలు బాదడంతో ముంబైకి భారీ స్కోరు సాధ్యమైంది. రెండో వికెట్‌కు వీరిద్దరు కలిసి 133 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆఖర్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కౌర్(12 బంతుల్లో 36, 2ఫోర్లు, 4సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో ముంబై 200 మార్క్ అందుకుంది. లక్ష్యఛేదనలో గుజరాత్ 19.2 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌటైంది. గిబ్సన్(34)టాప్ స్కోరర్‌గా నిలిచింది. మాథ్యూస్(3/31), కెర్(2/28) రాణించారు.