Mumbai Indians | మహిళల ప్రీమియర్ లీగ్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ప్రత్యేక సంగీత కార్యక్రమాలు, బాలీవుడ్ తారల డ్యాన్స్ షోలు, కండ్లు మిరుమిట్లు గొలిపే టపాసుల వెలుగుల్లో ప్రారంభమైన డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్‌లో ముంబై బ్యాటర్లు విశ్వరూపం చూపారు. హీలీ మాథ్యూస్, అమెలియా కెర్ మెరుపులకు.. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సుడిగాలి ఇన్నింగ్స్ తోడవడంతో ముంబై రెండొందల పైచిలుకు పరుగులు చేయగా.. కొండంత లక్ష్య ఛేదనలో గుజరాత్ కనీస ప్రతిఘటన చూపలేకపోయింది. అచ్చం ఐపీఎల్ ఆరంభ పోరు తరహాలోనే సాగిన డబ్ల్యూపీఎల్ మొదటి మ్యాచ్ సూపర్ హిట్ అయింది.
ముంబై: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)కు నగారా మోగింది. బాణాసంచా మోతలతో ప్రారంభమైన తొలి మ్యాచ్‌లో బ్యాటర్లు విశ్వరూపం చూపారు. టోర్నీ ఆరంభానికి ముందే విపరీతమైన ఆసక్తి రేకెత్తించిన డబ్ల్యూపీఎల్‌లో మొదటి మ్యాచ్‌లోనే ముంబై ప్లేయర్లు దంచికొట్టి.. టోర్నీలో శుభారంభం చేశారు. శనివారం డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన తొలి పోరులో ముంబై ఇండియన్స్ 143 పరుగుల తేడాతో గుజరాత్ జెయింట్స్‌పై ఘనవిజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.
కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (30 బంతుల్లో 65; 14 ఫోర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగగా.. హీలీ మాథ్యూస్ (31 బంతుల్లో 47; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), అమేలియా కెర్ (24 బంతుల్లో 45 నాటౌట్; 6 ఫోర్లు, ఒక సిక్సర్) దుమ్మురేపారు. బ్రంట్ (23; 5 ఫోర్లు), పూజ వస్ర్తాకర్ (15; 3 ఫోర్లు) కూడా రాణించడంతో ముంబై భారీ స్కోరు చేసింది. గుజరాత్ బౌలర్లలో స్నేహ్ రాణా 2 వికెట్లు పడగొట్టింది. అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన గుజరాత్ 15.1 ఓవర్లలో 64 పరుగులకు పరిమితమైంది. దయాలన్ హేమలత (29 నాటౌట్; ఒక ఫోర్, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ కాగా.. మిగిలినవాళ్లు పూర్తిగా విఫలమయ్యారు. కెప్టెన్ మూనీ (0) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగడం గుజరాత్‌కు భారీ దెబ్బకొట్టింది. ముంబై బౌలర్లలో సైకా 4 వికెట్లు పడగొట్టగా.. బ్రంట్, అమేలియా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అర్ధశతకంతో అదరగొట్టిన హర్మన్‌ప్రీత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది.
తొలుత ముంబై ఇన్నింగ్స్ 10 ఓవర్ల వరకు మామూలుగానే సాగినా.. ద్వితీయార్ధంలో హర్మన్ సునామీలా విరుచుకుపడింది. ఓపెనర్ యస్తిక భాటియా (1) మూడో ఓవర్లోనే వెనుదిరగగా.. మాథ్యూస్, బ్రంట్ ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఈ జోడీ వీలు చిక్కినప్పుడల్లా బౌండ్రీలు బాదడంతో ముంబై 10వ ఓవర్ పూర్తయ్యేసరికి 77 పరుగులు చేసి ఈ ఇద్దరి వికెట్లు కోల్పోయింది. ఇక అక్కడి నుంచి హర్మన్ దంచుడు ప్రారంభమైంది. స్నేహ్ రాణా ఓవర్లో రెండు ఫోర్లతో బౌండ్రీలకు గేట్లు ఎత్తిన హర్మన్ ఔటయ్యేంత వరకు అదే జోరు కొనసాగించింది. 12, 13 ఓవర్లలో రెండేసి ఫోర్లు బాదిన హర్మన్.. మోనికా పటేల్ వేసిన 15వ ఓవర్లో వరుసగా 4,4,4,4 అరుసుకుంది. గార్డ్నర్ వేసిన తదుపరి ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టిన ముంబై కెప్టెన్.. ఈ క్రమంలో 22 బంతుల్లో డబ్ల్యూపీఎల్‌లో తొలి అర్ధశతకం నమోదు చేసుకుంది. మరో భారీ షాట్‌కు యత్నించి హర్మన్ ఔట్ కాగా.. ఆఖర్లో అమేలియా కెర్, పూజ వస్ర్తాకర్ అదే జోరు కొనసాగించడంతో ముంబై రెండొందల మార్క్ దాటింది.
మహిళల క్రికెట్ రూపురేఖలు మార్చే సత్తా ఉన్న డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల నుంచే ప్రత్యేక కార్యక్రమాలు ప్రారంభం కాగా.. బాలీవుడ్ తారలు కియరా అద్వానీ, కృతి సనన్ తమ డ్యాన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇండో- కెనడియన్ సింగర్ అమృత్‌పాల్ సింగ్ ఢిల్లాన్ ప్రత్యేక సంగీత కార్యక్రమం ఆహూతులను కట్టిపడేసింది. అనతరం బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా సమక్షంలో ఐదు జట్ల కెప్టెన్లు కలిసి ట్రోఫీని ఆవిష్కరించారు. డబ్ల్యూపీఎల్ తొలి మ్యాచ్‌ను పలువురు రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులు ప్రత్యక్షంగా వీక్షించారు.
ముంబై: 20 ఓవర్లలో 207/5 (హర్మన్ 65, హీలీ 47; స్నేహ్ రాణా 2/43), గుజరాత్: 15.1 ఓవర్లలో 64 (హేమలత 29 నాటౌట్; సైకా 4/11, బ్రంట్ 2/5).