అహ్మదాబాద్ : వరుసగా నాలుగు ఓటముల తర్వాత ముంబై ఇండియన్స్ మళ్లీ గెలుపుబాట పట్టింది. సోమవారం ఇక్కడ పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో గుజరాత్ టైటాన్స్‌ను 99 పరుగుల తేడాతో చిత్తుచేసి భారీ విజయాన్ని నమోదుచేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై.. తిలక్ వర్మ (45 బంతుల్లో 101 నాటౌట్, 8 ఫోర్లు, 7 సిక్స్‌లు), నమన్ ధీర్ (32 బంతుల్లో 45, 6 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో ఆ జట్టు 20 ఓవర్లకు 5 వికెట్లు నష్టపోయి 199 రన్స్ చేసింది. ఛేదనలో టైటాన్స్ ఏ దశలోనూ గెలుపు దిశగా సాగలేదు. ముంబై బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి ఆ జట్టును 15.5 ఓవర్లలో 100 పరుగులకే కట్టడిచేశారు. వాషింగ్టన్ సుందర్ (26) టాప్ స్కోరర్. మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగిన అశ్వని కుమార్ (4/24) నాలుగు వికెట్లు తీయగా ఘజన్ఫర్, మిచెల్ శాంట్నర్ తలా రెండు వికెట్లు పడగొట్టి టైటాన్స్‌ను కోలుకోనీయకుండా చేశారు. హ్యాట్రిక్ విజయాల తర్వాత టైటాన్స్ మళ్లీ ఓడగా ఆ జట్టుకు టోర్నీలో ఇది మూడో పరాభవం.
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై.. రబాడా (3/33) విజృంభణతో పవర్ ప్లేలో డికాక్ (13), డానిష్ (2), సూర్యకుమార్ (15) వికెట్లను కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో నమన్‌తో కలిసి తిలక్ ముంబై ఇన్నింగ్స్‌ను పునర్నిర్మించాడు. ఈ జోడీ నాలుగో వికెట్‌కు 52 పరుగులు జోడించగా నమన్ నిష్క్రమించినా హార్ధిక్ (15)అండగా తిలక్ రెచ్చిపోయాడు. 22 బంతుల్లో 19 పరుగులే చేసిన అతడు.. ప్రసిద్ధ్ 15వ ఓవర్లో గేర్ మార్చి 6, 4, 4 బాదాడు. అదే ఊపులో రషీద్ ఓవర్లోనూ రెండు బౌండరీలు రాబట్టిన అతడు.. అశోక్ 18వ ఓవర్లో మూడు సిక్స్‌లు, రెండు బౌండరీలు దంచాడు. ఆఖరి ఓవర్లోనూ రెండేసి సిక్స్‌లు, ఫోర్లతో 22 రన్స్ రాబట్టి తన ఐపీఎల్ కెరీర్లో మొదటి శతకాన్ని నమోదుచేశాడు. మొదట 19 బంతుల్లో 22 రన్స్ మాత్రమే చేసిన అతడు.. తర్వాత 23 బంతుల్లో 82 పరుగులు రాబట్టడం గమనార్హం.
ముంబై: 20 ఓవర్లకు 199/5 (తిలక్ 101*, నమన్ 45, రబాడా 3/33, సిరాజ్ 1/25);
గుజరాత్: 15.5 ఓవర్లకు 100 ఆలౌట్ (వాషింగ్టన్ 26, షారుక్ 17, అశ్వని 4/24, ఘజన్ఫర్ 2/17)