IPL 2025 : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్ ముందు ముంబై ఇండియన్స్ (Mumbai Indians) కీలక నిర్ణయం తీసుకుంది. గత సీజన్లో హార్దిక్ పాండ్యా సారథ్యంలో ప్లే ఆఫ్స్ కూడా చేరలేకపోవడం పట్ల అసంతృప్తిగా ఉన్న ముంబై యాజమాన్యం హెడ్‌కోచ్‌పై వేటు వేసింది. ప్రధాన కోచ్‌గా సేవలందిస్తున్న మార్క్ బౌచర్ (Mark Boucher)పై వేటు వేస్తూ.. మహేళ జయవర్థనే (Mahela Jayawardene)కు మళ్లీ పగ్గాలు అప్పగించింది.
ముంబైకి 2017 నుంచి 2022 వరకూ హెడ్‌కోచ్‌గా పనిచేసిన ఈ శ్రీలంక దిగ్గజం మరోసారి జట్టును ట్రోఫీ విజేతగా నిలిపే పనిలో నిమగ్నం కానున్నాడు. ఈ విషయాన్ని ఆదివారం ముంబై ఫ్రాంచైజీ ఎక్స్ వేదికగా వెల్లడించింది. మళ్లీ ముంబై ప్రధాన కోచ్ కావడం పట్ల జయవర్దనే స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశాడు.
𝐌𝐚𝐡𝐞𝐥𝐚 𝐉𝐚𝐲𝐚𝐰𝐚𝐫𝐝𝐞𝐧𝐞. 𝐇𝐞𝐚𝐝 𝐂𝐨𝐚𝐜𝐡. 𝐁𝐚𝐜𝐤 𝐢𝐧 𝐭𝐡𝐞 𝐨𝐟𝐟𝐢𝐜𝐞 💙#MumbaiMeriJaan #MumbaiIndians | @MahelaJay pic.twitter.com/SajRfzLYkQ
— Mumbai Indians (@mipaltan) October 13, 2024
ముంబై ఇండియన్స్‌తో నా ప్రయాణం ఎల్లప్పుడూ చాలా గొప్పది. 2017లో ప్రతిభగల కుర్రాళ్లను వెలికితీసి వాళ్లతో అత్యుత్తమ క్రికెట్ ఆడేలా చేశాం. ఇప్పుడు మళ్లీ హెడ్‌కోచ్‌గా నియమితులయ్యాను. ముంబైని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తాను. అంతేకాదు ముంబై గత చరిత్రను కొనసాగిస్తాం. కొత్త సవాల్‌ను స్వీకరించేందుకు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా అని జయవర్దనే తెలిపాడు. ఈమధ్యే ముంబై ఫ్రాంచైజీ బౌలింగ్ కోచ్‌గా మాజీ పేసర్ జహీర్ ఖాన్(Zaheer Khan)ను తీసుకున్న విషయం తెలిసిందే.
ముంబైతో జయవర్దనేకు విడదీయలేని బంధం ఉంది. ఒకప్పుడు ఆటగాడిగా నీలం రంగు, బంగారు చారల జెర్సీ వేసుకున్న అతడు.. కోచ్‌గా తన ముద్ర వేశాడు. రోహిత్ శర్మ (Rohit Sharma), జయబర్ధనే హయాంలో ముంబై జట్టు బలీయమైన శక్తిగా ఎదిగింది. 2017 నుంచి 2022 మధ్య ఏకంగా మూడుసార్లు ముంబై ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది.
అయితే.. మార్క్ బౌచర్ వచ్చాక ముంబై ఒక్క ట్రోఫీ కూడా గెలవలేకపోయింది. పైగా రోహిత్‌ను కెప్టెన్‌గా తప్పించడం.. పాండ్యాకు పగ్గాలు అప్పగించడం కూడా ఆ జట్టు ప్రదర్శనపైనా ప్రభావం చూపింది. దాంతో.. ఫ్రాంచైజీ యాజమాన్యం ‘మళ్లీ నువ్వే రావాలయ్యా’ అని ఆహ్వానించడమే ఆలస్యం.. జయవర్దనే ఓకే చెప్పేశాడు. ఇప్పటికే అతడు అంతర్జాతీయ లీగ్స్‌లో ముంబై ఫ్రాంచైజీ అనుబంధ జట్ల ఆటగాళ్ల ఎంపికలో, వాళ్ల శిక్షణలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.