రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తిరోగమించనున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, అస్సాం, మేఘాలయలోని మిగిలిన ప్రాంతాల నుంచి అలాగే అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాల నుంచి నైరుతి రుతుపవనాలు మరింత ఉపసంహరించుకోవడానికి పరిస్థితులు మారుతున్నాయని తెలిపింది. ఆ తర్వాత రెండు రోజుల్లో దేశంలోని మిగిలిన ప్రాంతాల నుంచి ఉపసంహరించుకునే అవకాశం ఉందని తెలిపింది.
నైరుతి రుతుపవనాలు తిరోగమన సమయంలో దక్షిణ భారత దేశ ద్వీపకల్ప మీదుగా తూర్పు, ఈశాన్య గాలులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ద్వీపకల్ప భారతదేశ, దక్షిణ, దాన్ని ఆనుకుని ఉన్న మధ్య బంగాళాఖాతం, ఆగ్నేయ ద్వీపకల్ప ప్రాంతంలో ఈశాన్య రుతుపవనాల వర్షపాత కార్యకలాపాలు ప్రారంభమవుతాయని పేర్కొంది.
నైరుతి బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో సుమద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఇది విస్తరించి ఉందని పేర్కొంది. ఇది సోమవారం నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. మరో 48 గంటల్లో ఇది మరింత బలపడే సూచనలు ఉన్నాయని చెప్పింది. దీని ప్రభావంతో 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇక తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.