ముంబై : ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లుగా గుర్తింపు పొందిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఆరో టైటిల్‌పై కన్నేశాయి. ఈ లీగ్ ప్రారంభ దశ నుంచి ఆడుతూ అశేషమైన అభిమానగణాన్ని సాధించుకోవడమే గాక సీజన్ సీజన్‌కూ తమ విలువను పెంచుకుంటున్న అతికొద్ది ఫ్రాంచైజీలలో రెండైన ఈ దిగ్గజ జట్లు.. గత కొన్నాళ్లుగా ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నా ఈసారి మాత్రం పట్టు విడువొద్దనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాయి. ముంబైకి ఐదు ట్రోఫీలు (2013, 2015, 2017, 2019, 2020) అందించిన దిగ్గజ సారథి రోహిత్ శర్మ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుని అదే జట్టులో స్టార్‌గా ఎదిగిన ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాకు పగ్గాలు అప్పజెప్పి పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు. ఇక మరోవైపు లెజెండరీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సైతం ఐదుసార్లు (2010, 2011, 2018, 2021, 2023) సీఎస్కేకు ట్రోఫీలను అందించి ఆ జట్టును శిఖరాగ్రాన నిలిపి రుతురాజ్ గైక్వాడ్‌కు తన వారసత్వ బాధ్యతలు అందించినా.. 42 ఏండ్ల వయసులోనూ టీమ్‌కు మార్గదర్శకుడిగా ఉంటూ ఆటగాడిగా తన సత్తా చాటడానికి సిద్ధమవుతున్నాడు. మరి ఈ రెండు జట్లలో ఎవరు ‘ఆరో కప్పు’ కలను నెరవేర్చుకుంటారనేది ఆసక్తికరం!
నిరుటి సీజన్‌తో తమ ఫ్రాంచైజీలకు పూర్తిస్థాయి సారథ్య పగ్గాలు చేపట్టిన హార్ధిక్, రుతురాజ్.. ట్రోఫీయే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఇటీవల నిర్వహించిన ఫ్యాన్స్ మీట్స్‌లో తమ ఫ్రాంచైజీలకు ఆరో ఐపీఎల్ టైటిల్‌ను అందివ్వడమే తమ ముందున్న లక్ష్యమని ప్రకటించారు. హార్ధిక్ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నా ముందున్న ఒకే ఒక లక్ష్యం ముంబైకి ఆరో టైటిల్‌ను అందివ్వడమే. అదే సమయంలో ముంబైకి ఉన్న ఘనమైన వారసత్వాన్ని కొనసాగించడం’ అంటూ అతడు వ్యాఖ్యానించాడు. ఇక చెన్నై టీమ్ జెర్సీ లాంచ్ ఈవెంట్లో రుతురాజ్ మాట్లాడుతూ.. ‘అసాధ్యమనేదేదీ లేదు. ఈసారి కచ్చితంగా ఆరో టైటిల్ లక్ష్యంగా ఆడుతాం’ అని జట్టు ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పాడు. ఈ రెండు జట్లు ప్లేఆఫ్స్‌కు గనుక వస్తే రెండింటిలో ఏదో ఒక జట్టు ఫైనల్లో కప్పు కొట్టడం ఖాయం. చరిత్ర చెబుతున్న వాస్తవమిది!
2023లో విజేతగా నిలిచినా 2024లో ఐదో, నిరుడు ఏకంగా పదో స్థానానికి పరిమితమైన చెన్నై.. ఈసారి జట్టులో భారీ ప్రక్షాళన చేసి యువ మంత్రాన్ని జపించింది. ధోనీ, దూబె, రుతురాజ్ వంటి సీనియర్లకు తోడు అయూశ్ మాత్రె, ఉర్విల్ పటేల్, కార్తీక్ శర్మ, డెవాల్డ్ బ్రెవిస్, ప్రశాంత్ వీర్ వంటి ఫ్యూచర్ కోర్ గ్రూప్‌ను తయారుచేసుకుంది. అయితే సీఎస్కేలో ధోనీ తర్వాత ఆ స్థాయి గుర్తింపు పొందిన రవీంద్ర జడేజాను రాజస్థాన్ రాయల్స్‌కు ట్రేడ్ చేసిన చెన్నై.. ఆ స్థానంలో సంజూ శాంసన్‌ను తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీనివెనుక దీర్ఘకాలిక లక్ష్యాలు కూడా లేకపోలేదు. సీఎస్కే అభిమానులకు జడేజా పోయిన బాధ కంటే తమ పక్క రాష్ర్టానికి చెందిన శాంసన్ జట్టుతో కలవడం వారి ఆనందాన్ని రెట్టింపు చేస్తున్నదనడానికి ఇటీవల జరిగిన కార్యక్రమాల్లో ఫ్యాన్స్ ఉత్సాహమే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. శాంసన్‌లో ధోనీని చూసుకుంటున్న సీఎస్కే అభిమానులు.. అతడు గనుక అంచనాలను అందుకుంటే చెన్నై నాయకత్వ పగ్గాలు అందుకోవడం పెద్ద విషయమేమీ కాదు. టీ20 ప్రపంచకప్ నాకౌట్ ప్రదర్శనల తర్వాత సంజూపై అంచనాలైతే విపరీతంగా పెరిగాయి. మరి ఈ కేరళ కుర్రాడు.. తమిళ తంబీలను ఎలా మెప్పిస్తాడో త్వరలో తేలనుంది.