Ranji Trophy | ముంబై: ముంబై మరోసారి జూలు విదిల్చింది. పూర్తి ఏకపక్షంగా సాగిన సెమీఫైనల్లో తమిళనాడుపై ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీని ద్వారా రంజీ ట్రోఫీ చరిత్రలో రికార్డు స్థాయిలో 48వ సారి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఓవర్‌నైట్ స్కోరు 353-9తో మూడో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై 378 పరుగులకు ఆలౌటైంది. దీంతో ముంబైకి 232 పరుగుల ఆధిక్యం దక్కింది. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన తమిళనాడు..162 పరుగులకు కుప్పకూలింది. బాబా ఇంద్రజీత్(70) తప్ప మిగతా బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. సెంచరీతో ముంబైకి భారీ స్కోరు అందించిన ఆల్‌రౌండర్ శార్దుల్ ఠాకూర్ రెండు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకమయ్యాడు. శామ్స్ ములానీకి నాలుగు వికెట్లు దక్కగా, మోహిత్ అవస్తి, తనుష్ చెరో రెండు వికెట్లు తీశారు.
ఆధిక్యంలో విదర్భ : మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మరో రంజీ సెమీస్‌లో విదర్భ భారీ ఆధిక్యం దిశగా సాగుతున్నది. ఓవర్‌నైట్ స్కోరు 13-1 మూడో రోజు ఆట కొనసాగించిన విదర్భ చివరికి 343-6 స్కోరు చేసింది. ఆరంభంలోనే వికెట్లు పడ్డా..యష్ రాథోడ్ (97 బ్యాటింగ్), అక్షయ్ వాడ్కర్ (77), అమన్ (59), ధృవ్ షోరె (40) రాణించారు. మధ్యప్రదేశ్ బౌలర్లలో అనుభవ్, కార్తీకేయ రెండేసి వికెట్లు తీశారు.