ఇటీవలి కాలంలో టీమిండియా ఆడిన మ్యాచుల్లో ఒత్తిడి పెరిగినప్పుడు రోహిత్ శర్మ ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. క్యాచులు మిస్ చేసిన ఫీల్డర్లను తిడుతూ.. బౌలర్లపై విసుగు ప్రదర్శిస్తూ కనిపిస్తున్నాడు. గతంలో అయితే రోహిత్ కూడా.. కెప్టెన్ కూల్ ధోనీలా ప్రశాంతంగా ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ రోహిత్ అలాకాకుండా అరుస్తూ, తిడుతూ ఉండటంతో ఆశ్చర్యపోతున్నారు.
ఈ క్రమంలో ఒక సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తను ప్రశాంతంగా ఉండటానికి కారణాలను ధోనీ వివరించాడు. ‘మైదానంలో ఉన్నప్పుడు మేం ఎలాంటి తప్పులూ చెయ్యాలని అనుకోం. అందుకే ఆ పొరపాటు చేసిన ఆటగాడి స్థానంలో ఉండి ఆలోచిస్తా. వాళ్లపై కోపం తెచ్చుకుంటే ప్రయోజనం ఏముంటుంది? అక్కడ కనీసం 40 వేల మంది ప్రత్యక్షంగా మ్యాచ్ చూస్తుంటారు.
ఇక టీవీలు, లైవ్ స్ట్రీమింగ్స్‌లో అయితే కోట్ల మంది చూస్తారు. అందుకే అసలు ఆ తప్పు ఎందుకు చేశాడు? అనే కారణం కోసం చూస్తా’ అని ధోనీ చెప్పాడు. ఒక ఆటగాడు నూరు శాతం అటెంటివ్గా ఉండి కూడా పొరపాటున క్యాచ్ మిస్ చేస్తే అది సమస్య కాదన్నాడు.
ఆ తర్వాత ప్రాక్టీస్‌లో అతను ఎన్ని క్యాచ్‌లు పట్టుకుంటున్నాడు? తనను తాను మెరుగు పరచుకోవడానికి కృషి చేస్తున్నాడా? లేదా? అని కూడా తను గమనిస్తానని ధోనీ తెలిపాడు. ‘కేవలం ఆ ఆటగాడు క్యాచ్ వదిలేశాడనే కాకుండా.. ఇవన్నీ గమనిస్తూ ఆటగాడి స్థానంలో ఉండి ఆలోచించడానికి ప్రయత్నిస్తా’ అని వివరించాడీ భారత మాజీ కెప్టెన్.