Rajkumar Sharma : భారత జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ రికార్డులు చూస్తే తెలుస్తుంది అతనెంత గొప్ప క్రికెటరో. అయితే.. ఛేజ్ మాస్టర్‌గా పేరొందని అతను 2021-22లో గడ్డు కాలం ఎదుర్కొన్నాడు. ఫామ్ కోల్పోయి కొన్ని రోజులు ఆటకు దూరమైన విషయం తెలిసిందే. అయితే.. కోహ్లీ ఫామ్ కోల్పోయి విమర్శలు ఎదుర్కొన్నప్పడు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాత్రమే అతడికి అండగా నిలిచాడని కోహ్లీ చిన్నప్పటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ అన్నాడు. తన శిష్యుడికి అన్ని విధాలా మద్దతిచ్చిన ధోనీపై అతను ప్రశంసలు కురిపించాడు.
‘కోహ్లీ ఎల్లప్పుడూ ధోనీని గౌరవించేవాడు. అతడిని పెద్దన్నలా భావించేవాడు. అంతేకాదు తన కెప్టెన్సీలో ధోనీ అడినప్పుడు విరాట్ ఆఖరి ఓవర్లలో లాంగ్ ఆన్‌లో ఫీల్డింగ్ చేసేవాడు. ఎందుకో తెలుసా..? తన పెద్దన్న ధోనీ బౌలర్లు, ఫీల్డ్ సెటప్‌ను చూసుకుంటాడని అతను నమ్మేవాడు’ అని రాజ్‌కుమార్ వెల్లడించాడు. రాజ్‌కుమార్ స్థాపించిన వెస్ట్ ఢిల్లీ క్రికెట్ అకాడమీలో కోహ్లీ కొన్నాళ్లు ట్రైనింగ్ తీసుకున్నాడు.
ఈమధ్య కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) పాడ్‌కాస్ట్ సీజన్ 2లో ధోనీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నాడు. తన కెరీర్లో ఎవరితో షేర్ చేసుకోని విషయాలు పంచుకున్నాడు. కష్ట సమయంలో ధోనీ తనకు అండగా నిలిచాడని, అతడికి తాను కుడిభుజంలా ఉన్నానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు టీమిండియాను వరల్డ్ నంబర్ జట్టు చేసినా కూడా తనను అందరూ ఒక ఫెయిల్యూర్ కెప్టెన్‌గానే చూశారని ఈ స్టార్ ప్లేయర్ కలత చెందాడు. అయితే.. 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులో తాను సభ్యుడినని అతను గుర్తు చేశాడు. తాను టెస్టు కెప్టెన్సీ వదులుకున్నప్పుడు ధోనీ మాత్రమే ఫోన్ చేశాడని కోహ్లీ ఇంతకుముందే చెప్పాడు. దాంతో, సునీల్ గవాస్కర్‌తో పాటు పలువురు మాజీ క్రికెటర్లు అతనిపై విమర్శలు చేశారు.
రెండేళ్ల క్రితం ఫామ్‌లో లేక ఇబ్బంది పడిన కోహ్లీ 2022 ఆసియా కప్‌లో బ్యాట్ ఝులిపించాడు. టీ20 వరల్డ్ కప్‌లో అదరగొట్టాడు. బంగ్లాదేశ్ సిరీస్, శ్రీలంక సిరీస్‌లో మూడు సెంచరీలు కొట్టాడు. అంతేకాదు బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టులో అతను అన్ని ఫార్మాట్లలో 25 వేల పరుగుల మైలురాయికి చేరువయ్యాడు. తక్కువ ఇన్నింగ్స్‌ల్లోనే పాతిక వేల రన్స్ చేసి లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బద్ధలు కొట్టాడు.