IPL 2025 : ఐపీఎల్ చరిత్రలో ఎంఎస్ ధోనీ(MS Dhoni)ది ప్రత్యేక స్థానం. టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన మహీ భాయ్.. చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)ను ఐదుసార్లు విజేతగా నిలిపాడు. అలాంటి ధోనీ 18వ సీజన్లో తన ముద్ర వేయలేకపోయాడు. సొంతగడ్డపై పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమితో సీఎస్కే అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే.. సీజన్ మధ్యలో కెప్టెన్సీ చేపట్టిన ధోనీ ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న రికార్డు మాత్రం చెరిగిపోనుంది.
రుతురాజ్ గైక్వాడ్ గాయంతో టోర్నీ నుంచి వైదొలగడంతో ధోనీ మళ్లీ సీఎస్కే పగ్గాలు అందుకున్నాడు. అయితే.. లక్నో సూపర్ జెయింట్స్‌పై విజయంతో ఆశలు చిగురింపజేశాడు. కానీ, సమిష్టి వైఫల్యంతో చెన్నై ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది. దాంతో, సూపర్ కింగ్స్ జట్టు వరుసగా రెండోసారి ఫైనల్స్ ఆడే అవకాశాన్ని చేజార్చుకుంది. ఐపీఎల్ ఆరంభ సీజన్ నుంచి ఆడుతున్న ధోనీ వరుసగా రెండు ఫైనల్స్‌లో ఆడకపోవడం ఇదే మొదటిసారి. చెన్నైని ఐదు పర్యాయాలు విజేతగా నిలిపిన తాలకు కెరీర్ చరమాంకంలో ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ధోనీ కెప్టెన్సీలో సీఎస్కే ఇప్పటివరకూ 10 ఐపీఎల్ ఫైనల్స్ ఆడింది. 20008లో ఫైనల్లో రన్నరప్‌తో సరిపెట్టుకున్న చెన్నై 2010లో విజేతగా అవతరించింది. ఆ తర్వాతి ఏడాదిలోనూ ధోనీ బృందం కప్‌ను కొల్లగొట్టింది. అయితే.. 2012లోనూ టైటిల్ వేటలో అదరగొట్టిన సీఎస్కేకు ఫైనల్లో కోల్‌కతా షాకిచ్చింది. 2013, 2015లోనూ ఫైనల్ ఆడిన చెన్నై ట్రోఫీని అందుకోలేకపోయింది. 2018లో విజేతగా నిలిచిన ఎల్లో ఆర్మీ.. 2019లో ఓటమి పాలైంది. 2021, 2023లో ట్రోఫీని ఒడిసిపట్టిన ధోనీ సేన ఐదు టైటిళ్లతో ముంబై ఇండియన్స్ రికార్డును సమం చేసింది.
𝗖.𝗛.𝗔.𝗠.𝗣.𝗜.𝗢.𝗡.𝗦! 🏆
Chennai Super Kings Captain MS Dhoni receives the #TATAIPL Trophy from BCCI President Roger Binny and BCCI Honorary Secretary @JayShah 👏👏 #CSKvGT | #Final | @msdhoni pic.twitter.com/WP8f3a9mMc
— IndianPremierLeague (@IPL) May 29, 2023
అయితే.. 17వ సీజన్లో ధోనీ స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి వైదొలి.. రుతురాజ్ గౌక్వాడ్ను తన వారసుడిగా ప్రకటించాడు. కానీ, అతడి నేతృత్వంలో సీఎస్కే ఐదో స్థానంతో తీవ్రంగా నిరాశపరిచింది. దాంతో, 18వ సీజన్లో అయినా గైక్వాడ్ బృందం కప్ కొడుతుందని ఆశించారంతా. కానీ, ఈసారి కూడా చెన్నై జట్టు ఆట మారలేదు. ఓపెనర్లు, మిడిలార్డర్ వైఫల్యంతో 180 ప్లస్ లక్ష్యాలను ఛేదించలేక చతికిలపడింది సీఎస్కే.
ఐపీఎల్లో ధోనీ ఆడని ఫైనల్స్‌ను వేళ్ల మీద లెక్కించవచ్చు. మిస్టర్ కూల్ కెప్టెన్‌గా పేరొందిన మహీ ఇప్పటివరకూ 8 పర్యాయాలు ఫైనల్లో ఆడలేదు. 2009, 2014లో ధోనీ సేన ఫైనల్ చేరలేదు. అయితే.. బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో 2016, 2017లో సీఎస్కేపై నిషేధం విధించారు. ఆ తర్వాత అంటే 2020, 2022, 2024, 2025లో చెన్నై జట్టు టైటిల్ పోరుకు అర్హత సాధించలేదు.
ఈ ఎడిషన్‌లో చెన్నైకి 4 మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న చెన్నై ఇప్పుడు చేయగలిగిందల్లా.. విజయంతో టోర్నీకి వీడ్కోలు పలకడమే. అంతేకాదు ఇతర జట్ల ప్లే ఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసే అవకాశం కూడా ధోనీ బృందానికి ఉంది.