తిమ్మాజిపేట : పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ( Palamuru Lift Irrigation Project ) ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి కావడంతో అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టును పక్కన పెట్టిందని బీఆర్ఎస్ ( BRS ) నాయకుల ఆరోపించారు. బుధవారం తిమ్మాయిపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు జోగు ప్రదీప్, మాజీ ఎంపీపీ రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ గౌడ్ మాట్లాడారు.
వలసల జిల్లా పాలమూరులో రైతాంగాన్ని ఆదుకునేందుకు మాజీ సీఎం కేసీఆర్ ( KCR ) పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలిపారు. ప్రాజెక్టులో రిజర్వాయర్లను( Reservoir) కాల్వలను, టన్నెళ్లను పూర్తి చేశారని, అయితే 10 శాతం పనులు మిగిలి ఉండగానే ప్రభుత్వం మారడంతో పూర్తి చేయలేకపోయారన్నారు. నల్లమల్ల బిడ్డను చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి కావాలనే ప్రాజెక్టును పక్కన పెట్టారని, 16 నెలలకాలంగా తట్టెడు మట్టి కూడా తీయలేదని ఆరోపించారు.
కేసీఆర్ ప్రస్తావించడంతో ప్రభుత్వంలో కదలిక
వరంగల్ బహిరంగ సభలో పాలమూరు ప్రాజెక్టును మాజీ సీఎం కేసీఆర్ ప్రస్తావించడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. ఆదర బాదరగా మంత్రి హెలికాప్టర్లో విహార యాత్రకు వచ్చినట్లు వచ్చారని విమర్శించారు. ప్రాజెక్టుపై చిత్తశుద్ధి ఉంటే, ఇక్కడే కూర్చుని పూర్తి చేయాలన్నారు. గతంలో అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు ( Harish Rao ) ప్రాజెక్టుల పూర్తి కోసం అక్కడే రాత్రి, పగలు తేడా లేకుండా కూర్చునేవారని గుర్తు చేశారు.
కేవలం ఒక్కరోజు వచ్చి సమీక్ష చేస్తే ప్రాజెక్టు పూర్తి కాదని, ఇక్కడే కూర్చుని యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాలన్నారు. కాంగ్రెస్ మంత్రులకు హెలికాప్టర్లో తిరగడం పై ఉన్న ఉత్సాహం పాలనలో లేదన్నారు. లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తూ, కాలం వెళ్లదీస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టును పూర్తి చేయకుంటే, చూస్తూ ఊరుకోబోమని రైతులతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్, తారా సింగ్, వెంకటేష్, సైఫుద్దీన్, ప్రశాంత్, సలావుద్దీన్, నాగయ్య, శివ, ఇబ్రహీం, నవీన్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.