కారేపల్లి, మే 01 : ఖమ్మం జిల్లా సింగరేణి మండల పరిధిలోని విశ్వనాధపల్లి, సీతారాంపురం గ్రామ పంచాయతీల్లో విశాల సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. హంగూ ఆర్భాటాలతో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన అధికారులు, ఆశించిన మేరకు మాత్రం కొనుగోళ్లు జరపడం లేదు. దీంతో అనేక మంది రైతులు ప్రైవేట్ వ్యాపారులకు తమ ధాన్యాన్ని అమ్ముకుంటున్నారు. విశ్వనాధపల్లి కొనుగోలు కేంద్రంలో పదిహేను రోజుల నుండి రైతులు ధాన్యం నిల్వ చేసుకుని నానా ఇబ్బందులు పడుతున్నారు. కొనేవారు లేక పొద్దంతా కల్లాల వద్దే పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆకాల వర్షాలతో ధాన్యం తడిపోతుందేమోనని ఆందోళన చెందుతున్నారు. గత మూడు రోజులుగా అక్కడక్కడా వర్షాలు కురుస్తుండటంతో రైతుల్లో ఆందోళన మరింత పెరిగింది. తాసీల్దార్ సంపత్‌కుమార్ విశ్వనాధపల్లి ధాన్యం కొనగోలు కేంద్రాన్ని గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లో నిల్వ ఉంచిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేసి తరలించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.