న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) లావాదేవీలు జూన్ 16 నుంచి వేగవంతం కానున్నాయి. (UPI transactions) కొన్ని సేవల ప్రతిస్పందన సమయం గణనీయంగా తగ్గనున్నది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) దీని కోసం ఒక విధానాన్ని రూపొందించింది. ఏప్రిల్ 26న దీనికి సంబంధించిన ఉత్తర్వును జారీ చేసింది. వివిధ కేటగిరీల యూపీఐ లావాదేవీల కోసం సవరించిన సమయపాలనను అందులో ప్రకటించింది.
కాగా, డెబిట్, క్రెడిట్ చెల్లింపుల సమయం ఇప్పటి వరకు ఉన్న 30 సెక్లన్లకు బదులుగా 15 సెకన్లు ఉంటుంది. లావాదేవీల స్థితిని తెలుసుకోవడానికి గతంలో ఉన్న 30 సెకన్ల సమయాన్ని 10 సెకన్లకు సవరించారు. అలాగే లావాదేవీల రివర్సల్ కోసం ఉన్న ప్రతిస్పందన సమయం 30 సెకన్లను తాజాగా 10 సెకన్లకు తగ్గించారు. చిరునామా ధృవీకరణ సమయాన్ని 15 సెకన్ల నుంచి 10 సెకన్లకు కుదించారు.
మరోవైపు ఇటీవల యూపీవీ లావాదేవీల్లో సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో యూపీఐ వినియోగదారులకు మెరుగైన సేవల కోసం ఈ సవరణలు చేస్తున్నట్లు ఎన్పీసీఐ పేర్కొంది. బ్యాంకులు, చెల్లింపు సేవా సంస్థలు (పీఎస్పీ)లు తమ వ్యవస్థలో ఈ మేరకు అవసరమైన మార్పులు చేసుకోవాలని సూచించింది. సవరించిన సమయ ప్రతిస్పందనలకు అనుగుణంగా అన్ని భాగస్వామ్య, వ్యాపార, ఇతర పక్షాలు చర్యలు చేపట్టాలని పేర్కొంది.